ప్రతీకాత్మక చిత్రంకొత్త ఏడాదిలోకి అడుగుపెట్టి మూడు వారాలు దాటింది. పుస్తకాలు చదవాలని, వ్యాయామం చేయాలని, సంగీతం సాధన చేయాలని, కొత్త భాష నేర్చుకోవాలని… ఇలా జనవరి ఒకటో తేదీన చాలామంది కొత్త తీర్మానాలేవో చేసుకుని ఉంటారు.
ఆ తీర్మానాలను వారం తిరగకముందే వదిలేసినవారు కొందరైతే, పట్టుదలతో ఇంకా కొనసాగించేవారు మరికొందరుంటారు.
అయితే, “ఏదైనా పని 21 రోజుల పాటు లేదా మూడు వారాలు చేస్తే అది అలవాటుగా మారుతుంది” అని మనం తరుచూ వింటూ ఉంటాం. ఇందులో నిజమెంత?
ఒక పని అలవాటుగా మారడానికి నిజంగా ఎన్నిరోజులు పడుతుంది? దీనిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయి? నిపుణులు ఏమంటున్నారు?
అలవాటు అంటే?
“ఒక పని మన ప్రమేయం లేకుండా, ఆలోచించకుండా ప్రతి రోజూ చేస్తున్నామంటే.. దాన్ని అలవాటు అంటారు” అని హైదరాబాద్‌కు చెందిన సైకాలజిస్ట్ విశేష్ బీబీసీతో చెప్పారు.
ఉదాహరణకు, “ఉదయాన్నే నిద్రలేవడం అలవాటుగా మారితే ఆటోమేటిక్‌గా నిద్రలేస్తాం. ఎందుకంటే అది మన మెదడులో న్యూరోలాజికల్ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన పని లేదు” అని ఆయన వివరించారు.
“ఒక పని అలవాటుగా మారాక, మనం ప్రత్యేకంగా దాన్ని కావాలనుకోం. ఆ సమయానికి మనం అది చేసేస్తాం అంతే” అని ఆయన చెప్పారు.
’21 రోజుల’ పదం ఎలా పుట్టింది?
21 రోజుల పాటు పని చేస్తే అది అలవాటుగా మారుతుందని చాలామంది అనడం వినే ఉంటాం.
అయితే ఈ భావన, ప్లాస్టిక్ సర్జన్ నుంచి సైకాలజిస్టుగా మారిన డాక్టర్ మ్యాక్స్‌వెల్ మాల్ట్జ్ ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన 1960లో రాసిన “సైకో సైబర్నేటిక్స్” అనే పుస్తకంలో ఇలా రాశారు.
“ఒక మానసిక చిత్రంలో ఏదైనా గుర్తించదగిన మార్పు రావడానికి సాధారణంగా కనీసం 21 రోజులు పడుతుంది. ఓ సాధారణ రోగికి ప్లాస్టిక్ సర్జరీ తర్వాత తన కొత్త ముఖానికి అలవాటు పడటానికి 21 రోజులు పడుతుంది. కాలు లేదా చేయిని తొలగించిన తర్వాత “ఫాంటమ్ లింబ్(అవయవం ఉన్నట్లు భ్రమ)” దాదాపు 21 రోజులు ఉంటుంది. ఎవరైనా ఒక కొత్త ఇంట్లో అది ‘ఇల్లులా’ అనిపించాలంటే దానికి ముందు దాదాపు మూడు వారాల పాటు నివసించాలి. ఇవన్నీ అలాగే సాధారణంగా గమనించే మరికొన్ని విషయాలు.. ఒక కొత్త అంశం మానసికంగా స్థిరపడటానికి కనీసం 21 రోజులు పడుతుందని చూపిస్తున్నాయి” అని ఆయన రాశారు.
‘ప్రేరణనిచ్చే నినాదం’
“21 రోజుల్లో అలవాటు మారుతుంది లేదా కొత్త అలవాటు ఏర్పడుతుంది అనడానికి సైకాలజీలోగానీ, న్యూరో సైన్స్‌లో గానీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు” అని విశేష్ బీబీసీతో చెప్పారు.
“ఇది మోటివేషనల్ స్లోగన్ తప్ప, న్యూరోలాజికల్ ట్రూత్” అయితే కాదని అన్నారు.
కొత్త అలవాటు ఏర్పడాలంటే మెదడులో కొత్త న్యూరల్ సర్క్యూట్స్ బలపడాలని విశేష్ చెప్పారు. ఇది మూడు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన వివరించారు.
1. కాంప్లెక్సిటీ
“ఉదాహరణకు రోజు పొద్దున్నే నీళ్లు తాగాలని అలవాటు చేసుకోవాలనుకుంటే అది సులభంగా చేయొచ్చు. రోజూ వ్యాయామం చేయడం అనేది కాస్త కష్టంగా ఉండవచ్చు. అదే ఫోన్ తగ్గించాలనుకోవడం ఇంకా కష్టంగా ఉండొచ్చు. ఈ మూడింట్లో నీళ్లు తాగడంలో ఉన్న కాంప్లెక్సిటీ కంటే మిగతా రెండింట్లో ఇంకా ఎక్కువ కాంప్లెక్సిటీ ఉంటుంది”
2. ఎమోషనల్ రెసిస్టెన్సీ
“మనం ఓ కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఆ కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు వస్తే మెదడు ఒప్పుకోదు. అప్పుడు ఓ పనికి అలవాటు పడటానికి ఎక్కువ సమయం పట్టొచ్చు”
3. ఎన్విరాన్మెంటల్ సపోర్ట్
“కేవలం సంకల్పం ఉన్నంత మాత్రాన మన ప్రవర్తనలో మార్పు రాదు. ఎందుకంటే, బ్రెయిన్ మన నిర్ణయాల కంటే మన చుట్టూ ఉండే వాటికి ఎక్కువ స్పందిస్తుంది”
కాబట్టి, ఈ మూడు అంశాలు ఒక అలవాటు ఏర్పడటంలో కీలకంగా పని చేస్తాయని విశేష్ వివరించారు.
కొత్త సంవత్సరం తీర్మానాలు ఎందుకు ఫెయిల్ అవుతాయంటే..
జనవరి 1న తీర్మానం చేసుకుని, జనవరి 21 దాకా వాటికి కట్టుబడి ఉండే వాళ్లు తక్కువమందే ఉంటున్నారు. 2023లో చూస్తే అమెరికాలో ఇలా కేవలం 9 శాతం మందే తమ తీర్మానాలకు కట్టుబడి ఉన్నారని ఒక సర్వే తెలిపింది.
“అందరూ 21 రోజులు చాలనుకుంటారు. అలా జరగకపోతే ఇక నాలో క్రమశిక్షణ లేదని దాన్ని వదిలేస్తాం. ఇదే న్యూ ఇయర్ రిజల్యూషన్ ఫెయిల్ అవ్వడానికి ఓ కారణం” అని విశేష్ బీబీసీతో చెప్పారు.
మనం ఏదైనా అలవాటును మార్చాలన్నా, కొత్త అలవాటును ఏర్పరుచుకోవాలన్నా మూడు దశలుగా చూడాలని ఆయన అంటున్నారు.
“ఒకటి అవగాహన దశ- ఇది రెండు నుంచి మూడు వారాలు. రెండోది స్థిరీకరణ దశ-6 నుంచి 10 వారాలు. మూడోది గుర్తింపు దశ- 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఈ మూడు దశలు దాటినప్పుడే మన ప్రవర్తనలో నిజమైన మార్పు జరుగుతుంది”
”ఈ 21 రోజుల కాలగణన అన్నింటికీ, అన్ని రకాల అలవాట్లకు వర్తించదు. ప్రతీ అలవాటుకు ఉండే స్వభావం కారణంగా మన మెదడులోని నాడీ వ్యవస్థ స్పందించే సమయం వేర్వేరుగా ఉంటుంది. అయితే, ఒక పని అలవాటు కావడానికి క్రమం తప్పకుండా సగటున 21 రోజుల పాటు చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఒక రోజు చేయకపోయినా మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టాలి” అని కౌన్సిలర్ చిత్ర గతంలో బీబీసీతో అన్నారు.
‘ఇది 4 నుంచి 335 రోజులు’
ఆరోగ్య అలవాట్లు రూపొందడానికి వివిధ రకాల సమయాలు అవసరమయ్యాని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన “‘టైమ్ టు ఫామ్ ఏ హ్యాబిట్: ఏ సిస్టమెటిక్ రివ్యూ అండ్ మెటా-అనాలసిస్ ఆఫ్ హెల్త్ బిహేవియర్ హ్యాబిట్ ఫార్మేషన్ అండ్ ఇట్స్ డిటర్మినెంట్స్” అనే ఓ అధ్యయనం పేర్కొంది.
“ఉదాహరణకు.. అలవాటుగా మారడానికి పట్టే సమయం మధ్యస్థ రోజులను పరిగణనలోకి తీసుకుంటే.. 59 నుంచి 66 రోజుల మధ్య ఉండగా, సగటు రోజులను బట్టి చూస్తే 106 నుంచి 154గా ఉన్నాయి. అంతేకాకుండా.. వ్యక్తిగత స్థాయిలో కూడా అలవాట్లు రూపొందడానికి పట్టే రోజుల్లో గణనీయమైన వ్యత్యాసం కనిపించింది. ఇది 4 నుంచి 335 రోజుల వరకు ఉంటుంది” అని ఈ అధ్యయనం తెలిపింది.
“సంక్షిప్తంగా చెప్పాలంటే, మా ఫలితాలు ఇప్పటివరకు చేసిన ఇతర అధ్యయనాల ఫలితాలతో పాటు, ఏ పనైనా అలవాటుగా సుమారు 21 రోజులు పడుతుందని ప్రచారంలో ఉన్న భావనను స్పష్టంగా ఖండిస్తున్నాయి” అని ఈ అధ్యయనం పేర్కొంది.
2,601 మంది పాల్గొన్న 20 అధ్యయనాలను కలిపి ఈ క్రమబద్ధమైన సమీక్ష చేశారు.
అనేక అధ్యయనాల ప్రకారం, ఒక పని అలవాటుగా మారడానికి 18 నుంచి 200 రోజుల వరకు పట్టొచ్చు అని విశేష్ తెలిపారు.
“చెడు అలవాట్లు ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తాయి. ఎందుకంటే, దీనికి కారణం మెదడులో విడుదలయ్యే డోపమైన్ హార్మోన్” అన్నారు.
“రీల్ చూస్తే వచ్చే డోపమైన్ వేరు, బుక్ చదివితే వచ్చే డోపమైన్ వేరు. రీల్ చూడటంతో పోలిస్తే బుక్ చదివితే వచ్చే డోపమైన్ చాలా ఆలస్యంగా ఉంటుంది”


































