అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను

అగ్రరాజ్యం అమెరికా ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి విలవిలలాడుతోంది. ఫెర్న్ అని పిలుస్తున్న అత్యంత శక్తివంతమైన మంచు తుఫాను దేశంలోని మెజారిటీ రాష్ట్రాలను గజగజ వణికిస్తోంది.


సుమారు 2,000 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ తుఫాను ప్రభావంతో అమెరికాలోని దాదాపు 20 కోట్ల మంది ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం ఇప్పటికే 21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది.

అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మైనస్ 40 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. ఇంతటి అతిశీతల పరిస్థితుల వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీగా కురుస్తున్న మంచు వల్ల రహదారులు, భవనాలు, వాహనాలు అన్నీ మంచు దుప్పటి కింద కూరుకుపోయాయి. గడ్డకట్టే గాలుల వల్ల నిమిషాల వ్యవధిలోనే ఫ్రాస్ట్బైట్ బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

15,000 విమాన సర్వీసులు రద్దు

ఈ మంచు బీభత్సం విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటి వరకు దాదాపు 15,000 విమాన సర్వీసులు రద్దయ్యాయి, వేలాది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు. రైలు ప్రయాణాలు కూడా నిలిచిపోయాయి. మరోవైపు, మంచు ధాటికి విద్యుత్ లైన్లు తెగిపోవడంతో టెక్సాస్, లూసియానా వంటి రాష్ట్రాల్లో లక్షలాది ఇళ్లు చీకట్లో మగ్గుతున్నాయి. అనేక చోట్ల గ్రిడ్ వ్యవస్థ దెబ్బతినడంతో కరెంట్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అమెరికా చరిత్రలో ఇది ఒక ‘చారిత్రక విపత్తు’గా నిలుస్తుందని నిపుణులు అభివర్ణిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.