నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘ద ప్యారడైజ్’. లెక్క ప్రకారం మార్చి 26న థియేటర్లలోకి రావాలి. కానీ వాయిదా గ్యారంటీ అని తెలుస్తోంది. కాకపోతే ప్రస్తుతానికి ఈ విషయం గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
మే తొలి వారం లేదంటే జూన్ నెలలో రిలీజ్ ఉండొచ్చని మాట్లాడుకుంటున్నారు. సరే రిలీజ్ గురించి కాసేపు పక్కనబెడితే ఇదే మూవీ గురించిన ఓ విషయం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
‘ప్యారడైజ్’ మూవీలో నాని.. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. ఇదివరకే రిలీజ్ చేసిన గ్లింప్స్‌తో ఆ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు మోహన్ బాబు.. సికంజా మాలిక్ అనే విలన్‌గా కనిపించబోతున్నాడు. ‘కిల్’ ఫేమ్ రాఘవ్ జూయెల్ కూడా ఓ విలన్. ఇప్పుడు తనికెళ్ల భరణి కూడా ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే బయటపెట్టారు. చాన్నాళ్ల తర్వాత విలన్ రోల్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
కెరీర్ ప్రారంభంలో తనికెళ్లి భరణి.. విలన్ రోల్స్ ఎక్కువగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు అయిన తర్వాత తండ్రి తరహా పాత్రల్లో కనిపిస్తూ వచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రతినాయక పాత్ర అంటే విశేషమే. ఈ మూవీలోనే సీనియర్ నటుడు బాబు మోహన్ కూడా ఉన్నారు. ఈయనది కూడా నెగిటివ్ రోల్ అని తెలుస్తోంది. చూస్తుంటే నానితో ఢీ కొట్టేందుకు చాలామంది విలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నాని ఫ్రెండ్ బిర్యానీగా సంపూర్ణేశ్ బాబు నటిస్తున్నాడు. కాయదు లోహర్ హీరోయిన్. ఈ సినిమా కోసం ఒకప్పటి సీనియర్స్‌ని విలన్స్ చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. ఏం ప్లాన్ చేశాడనేది మూవీ రిలీజైతే తెలుస్తుంది.


































