రథ సప్తమి రోజున మూడు లక్షల మందికిపైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారు. చంద్ర ప్రభ వాహన సేవతో సప్త వాహన సేవలు ముగిశాయి.
రథ సప్తమి పవిత్రమైన రోజున తిరుమలలో స్వామివారు వాహన సేవలు భక్తుల కన్నుల విందు చేశాయి. సూర్యప్రభ, చిన శేష, గరుడ, హనుమంత వాహనాలను వీక్షించి, మధ్యమధ్యలో చక్రస్నానం, ఆహ్లాదకరమైన సాయంత్రం వేళలో కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలను భక్తులు తిలకించారు.
దైవిక వరాలను ఇచ్చే వృక్షం అయిన కల్పవృక్షంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప దేవుడి దివ్య వైభవాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. ఆ తర్వాత సర్వభూపాల వాహనంపై ముగ్గురు దేవతల రాజ దర్శనం జరిగింది. రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్య చంద్ర ప్రభ వాహన సేవతో సప్త వాహన సేవలు ముగిశాయి.
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో మూడు లక్షల మందికి పైగా భక్తులు శ్రీవారి వాహన సేవలు తిలకించారని టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలియజేశారు. రథ సప్తమి వేడుకల సందర్భంగా ఛైర్మన్.. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌తో కలిసి మాడ వీధుల్లోని గ్యాలరీలను పరిశీలించి, భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
టీటీడీ అధికారులు, విజిలెన్స్ విభాగం, జిల్లా పోలీసుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేడుకలను విజయవంతం చేసినట్లు టీటీడీ ఛైర్మన్ చెప్పారు. అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం, శ్రీవారి సేవకులు, భక్తులందరికీ ఛైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.
భక్తులకు టీటీడీ సాంబార్ రైస్, టమాటా రైస్, పెరుగు అన్నం, బాదం మిల్క్ తదితర 14 రకాల అన్నప్రసాదాలను నిరంతరంగా అందించింది. ఇందుకోసం ప్రత్యేకంగా 2,000 మంది సేవకులను అన్నప్రసాద వితరణకు, 750 మందిని తాగునీటి సరఫరాకు, మరో 250 మందిని భక్తుల రద్దీ నియంత్రణకు నియమించారు.
రథ సప్తమి ముఖ్యాంశాలు
- మూడు లక్షల మందికిపైగా భక్తులు వాహన సేవలను తిలకించారు.
- గ్యాలరీల్లోని భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ
- గ్యాలరీల్లో మొబైల్ వాటర్ డ్రమ్స్ తో నిరంతరం తాగునీటి సరఫరా
- మాడ వీధుల్లోని గ్యాలరీల్లో భక్తులకు ఎండకు, వర్షానికి ఇబ్బంది కలగకుండా పందిళ్లు ఏర్పాటు
- సుమారు 2,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు, 3,500 మంది శ్రీవారి సేవకులు.. భక్తులకు సేవలు
- 56 కళారూపాల్లో 1,000 మందికిపైగా కళాకారులు కళారూపాలు ప్రదర్శన
- భక్తుల కోసం నిరంతర మొబైల్ వైద్య సేవలు
- సెక్టోరల్ అధికారులు, డిప్యూటేషన్ సిబ్బంది 24 గంటల పాటు సౌకర్యాలను పర్యవేక్షణ

































