హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటలు పడుతున్న ఈ ప్రయాణం త్వరలోనే దాదాపు 5 గంటలకు తగ్గే అవకాశం ఉంది.తాజాగా జాతీయ రహదారి-44 (NH-44) కు ఆధునీకరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
దేశంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్‌రాష్ట్ర మార్గాల్లోఈ రహదారి ప్రధానంగా ఉంది.
హైదరాబాద్, బెంగళూరు నగరాలను కలుపుతూ కర్నూలు, నంద్యాల, అనంతపురం మీదుగా వెళ్లే NH-44 ప్రస్తుతం రెండు లేదా నాలుగు లేన్ల రహదారిగా ఉంది. భారీ వాహనాల రాకపోకలు, స్థానిక ట్రాఫిక్, పట్టణాల గుండా వెళ్లే మార్గాలు కారణంగా ప్రయాణంలో ఆలస్యాలు జరుగుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ రహదారిని ఆరు లేన్ల, యాక్సెస్-నియంత్రిత ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
ప్రారంభ దశలో ప్రస్తుత రహదారికి సమాంతరంగా పూర్తిగా కొత్త గ్రీన్‌ఫీల్డ్ హై-స్పీడ్ కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. దీనికోసం మూడు వేర్వేరు అలైన్‌మెంట్ స్టడీలను కూడా నిర్వహించారు. అయితే అధ్యయనాల అనంతరం.. ప్రతిపాదిత కొత్త మార్గం ప్రస్తుత NH-44కి చాలా దగ్గరగా ఉండటంతో పాటు, కొన్ని ప్రాంతాల్లో మరింత పొడవుగా ఉండే అవకాశముందని అధికారులు గుర్తించారు. దీనివల్ల భూసేకరణ సమస్యలు పెరగడం, నిర్మాణ వ్యయం భారీగా పెరగడం వంటి ఆందోళనలు తలెత్తాయి.
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, కొత్త రహదారి నిర్మాణం కంటే ప్రస్తుత NH-44ని విస్తరించి.. అప్‌గ్రేడ్ చేయడం ఎక్కువగా ఆచరణీయమని, ఖర్చు పరంగా లాభదాయకమని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రహదారి పూర్తిగా యాక్సెస్-కంట్రోల్డ్‌గా మారుతుంది. అంటే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిమిత ప్రదేశాల్లో మాత్రమే ఉండటంతో ట్రాఫిక్ సజావుగా సాగుతుంది.
ప్రస్తుతం హైదరాబాద్-బెంగళూరు మధ్య NH-44 మొత్తం పొడవు సుమారు 576 కిలోమీటర్లు. ఇందులో దాదాపు 210 కిలోమీటర్లు తెలంగాణలో, 260 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో, 106 కిలోమీటర్లు కర్ణాటకలో ఉన్నాయి. ఈ మొత్తం మార్గం ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వేగా మారిన తర్వాత.. వాహనాలు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా అధిక వేగంతో ప్రయాణించగలవు. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీలు వసూలు చేయనున్నారు.
ప్రధాన రహదారి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు వంటి నెమ్మదిగా కదిలే వాహనాలు ఈ సర్వీస్ రోడ్లను ఉపయోగించాలి. దీంతో ప్రధాన క్యారేజ్‌వేపై హైస్పీడ్ వాహనాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు.
ఇదే సమయంలో.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కూడా పూర్తయ్యే దశలో ఉంది. ఇది ప్రారంభమైతే, చిత్తూరు జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి బెంగళూరు లేదా చెన్నై నగరాలకు ఒకటి నుంచి ఒకటిన్నర గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో రూపొందించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వేలు దక్షిణ భారతదేశంలో రవాణా, వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఏదేమైనా NH-44 ఆధునీకరణతో పాటు కొత్త ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే.. దక్షిణ భారత రోడ్ కనెక్టివిటీ పూర్తిగా మారిపోనుంది.

































