విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. మళ్లీ వరుసగా భారీగా సెలవులు రానున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో విద్యార్థులు పండుగ చేసుకోవచ్చు.
ప్రభుత్వం నాలుగు రోజుల సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రానుండడం గమనార్హం. అన్ని చోట్ల స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలో భారీగా స్కూళ్లు, కాలేజ్‌లకు సెలవులు వచ్చాయి. ఇక గణతంత్ర దినోత్సవం రావడంతో ఆది, సోమవారం కలిపి రెండు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు ముగియగానే బుధవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో కాకుండా తెలంగాణలో ఈ సెలవులు ఉండనున్నాయి. అదీ కూడా ఒక్క రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఉంది.
తెలంగాణలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క. ఈ జాతర రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో కొలువైన అడవి తల్లులను దర్శించుకునేందుకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు.
సమ్మక్క సారక్క దేవతలను ఒక్క తెలంగాణ కాదు మహారాష్ట్ర, చత్తీస్‌గడ్, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు దర్శించుకుంటారు. ఈ జాతర సందర్భంగా ములుగు జిల్లాలో కోలాహలం ఉంటుంది. దారులన్నీ మేడారం అన్నట్టు పరిస్థితి ఉంటుండడంతో ఈ సమయంలో స్థానికంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం పీఆర్‌ర్టీయూ ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేసింది.
ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ సెలవులు ఇవ్వాలని పీఆర్‌టీయూ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే కాకుండా మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటుంది. బస్సులన్నీ అటు వైపే వెళ్తుంటాయి. దీంతో ములుగు జిల్లా వరకైనా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుండడంతో ఈ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడారం జాతర రాష్ట్ర పండుగ. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూడాలి.

































