ఒళ్లు జలదరించే దృశ్యాలు- కాశ్మీర్ లో రిసార్టుపై విరుచుకుపడ్డ అవలాంచీ

జమ్మూ కాశ్మీర్ ను మంచు తుఫాన్ వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. కొన్ని రోజులుగా చలిగాలులు కాశ్మీరాన్ని చుట్టుముట్టాయి. ఏకధాటిగా మంచు కురుస్తోంది.


గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇదే తీవ్రత మరిన్ని రోజుల పాటు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

జమ్మూ కాశ్మీర్ లో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే వాతావరణం నెలకొంది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్తవార్.. ఇలా ఏ ఒక్కటీ మినహాయింపు కాదు. రోడ్ల మీద రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది. రాత్రివేళ పార్కింగ్ లో ఉంచిన వాహనాలన్నీ కూడా తెల్లారే సరికి మంచుమయం అవుతున్నాయి. మంచు దుప్పటి కప్పుకొన్నట్లు కనిపిస్తోన్నాయా ప్రాంతాలన్నీ కూడా. చెట్లు, ఇళ్ల పైకప్పులపై దట్టంగా మంచు పేరుకుపోయింది.

తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోనమార్గ్‌లో మంగళవారం రాత్రి తీవ్రస్థాయి హిమపాతం సంభవించింది. అవలాంచీ ఏర్పడింది. రాత్రి 10:12 నిమిషాలకు సెంట్రల్ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలోని రిసార్ట్‌ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. అవలాంచీ అక్కడి రిసార్టులను మీద విరుచుకుపడింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హాలీవుడ్ సినిమాల్లో చూపినట్టుగా ఉప్పెనలా అవలాంచీ భవనాలను కప్పేయడం ఇందులో చూడొచ్చు.

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకర అవలాంచీ సంభవించే అవకాశం ఉందని సోమవారం నాడే హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్ మార్గ్‌తో పాటు కాశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

అటు- ఉత్తరాఖండ్‌లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా అవలాంచీ హెచ్చరికలు జారీ అయ్యాయి. బద్రీనాథ్, కేదార్‌నాథ్‌తో సహా చాలా చోట్ల తాజాగా మంచు కురవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో రాష్ట్రంలో హిమపాతం సంభవించడం ఇది రెండోసారి. జనవరి 23న కూడా భారీ మంచు కురిసింది. చమోలీ జిల్లాలోని బద్రీనాథ్, రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్, ఉత్తరకాశీ ఉన్నత ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుండి అడపాదడపా మంచు కురుస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.