సంక్రాంతి కానుకగా వచ్చిన మాస్ మహారాజా రవితేజ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జీ5 వేదికగా ఫిబ్రవరిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన ఫ్యామిలీ డ్రామా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. జనవరి 13న సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకుని.. బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. అయితే థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (Zee5) భారీ ధరకు సొంతం చేసుకుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్
రవితేజ నటించిన మరో డిజాస్టర్ మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇద్దరు హీరోయిన్లతో పండగకు వచ్చి సందడి చేసినా అతని రాత మారలేదు. మిగిలిన నాలుగు సినిమాల దెబ్బకు బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది.
తాజాగా ఓటీటీప్లే రిపోర్టు ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరి 13న స్ట్రీమింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జీ5 ఓటీటీలోకి ఈ మూవీ రానుంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ.. దాదాపుగా ఇదే తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకవేళ కుదిరితే ఈ తేదీ కంటే ముందే విడుదల చేసే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే ఓటీటీలోకి ఈసారి రానున్న తొలి సంక్రాంతి మూవీ ఇదే కానుంది.
భర్త మహాశయులకు విజ్ఞప్తి విశేషాలు
రవితేజ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో మాస్ ఇమేజ్ పక్కనపెట్టి కొత్తగా ప్రయత్నించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండటం సినిమాకు మైనస్ అయింది. ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ వంటి భారీ సినిమాలు.. ‘అనగనగా ఒక రాజు’, ‘నారి నారి నడుమ మురారి’ వంటి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ సంక్రాంతికి భారీ విజయాలు సాధించడంతో రవితేజ సినిమా వెనుకబడిపోయింది.
ఈ సినిమాలో రవితేజ ఒక వ్యాపారవేత్తగా కనిపిస్తాడు. భార్య (డింపుల్ హయతి), మరో మహిళ (ఆషికా రంగనాథ్) మధ్య నలిగిపోయే పాత్రలో అతడు నటించాడు. ఒక బిజినెస్ ట్రిప్ కోసం యూరప్ వెళ్ళినప్పుడు ఆషికాతో ఏర్పడిన సంబంధం, అతని వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు తెచ్చిందన్నది కథ. ఫస్ట్ హాఫ్ లో కామెడీ బాగున్నప్పటికీ.. సెకండాఫ్, ఎమోషనల్ సన్నివేశాలు పండకపోవడం, క్లైమాక్స్ ఆకట్టుకోకపోవడంతో సినిమా నిరాశపరిచింది.
ప్రస్తుతం రవితేజ తన తదుపరి మూవీ ‘ఇరుముడి’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తండ్రీ కూతుళ్ళ బంధం నేపథ్యంలో సాగే ఎమోషనల్ కథ అని సమాచారం. అయితే ఇది మలయాళం మూవీకి కాపీ అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు.

































