మరమ్మతులు, నివారణ చర్యలు చేపట్టకపోతే బ్యారేజ్ భద్రతకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉందని ఎన్డీఎస్ఏ నివేదిక స్పష్టం చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది.
లోక్‌సభలో దేశవ్యాప్తంగా డ్యామ్‌ల సేఫ్టీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేటగిరీ-1లో గుర్తించిన మూడు డ్యామ్‌లలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి కాగా.. మిగతావి ఉత్తరప్రదేశ్‌లోని లోయర్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్‌లోని బోకారో బ్యారేజ్‌లు ఉన్నాయని స్పష్టం కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
డ్యామ్ సేఫ్టీ యాక్ట్-2021 ప్రకారం ప్రతి సంవత్సరం వర్షాకాలం ముందు..తర్వాత తనిఖీలు తప్పనిసరి. 2025లో దేశవ్యాప్తంగా ప్రీ-మాన్సూన్ (వర్షాకాలానికి ముందు) 6,524 డ్యామ్‌లు పోస్ట్-మాన్సూన్ (వర్షాకాలం తర్వాత).. 6,553 డ్యామ్‌ల తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పరిశీలనల ఆధారంగా డ్యామ్‌లను మరమ్మతుల అత్యవసరతను బట్టి వర్గీకరించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్డీఎస్ఏ సూచించిన నివారణ, రక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. దేశంలో 50 ఏళ్లు దాటిన 1,681 డ్యాములు ఉన్నాయని రాజ్‌భూషణ్ చౌదరి స్పష్టం చేశారు.

































