ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది.
ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేసారు. దీంతో.. అధికారులు శాఖలవారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలు సేకరిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ఉండనుందని అధికారులు చెబుతున్నారు.
ఏపీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల లెక్కలు సిద్దం చేస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్‌ఆర్‌ఎంఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు. ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే డీఎస్సీ -2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసారు. వచ్చే ఫిబ్రవరి లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్దం చేస్తున్నారు.
శాఖల వారీగా ఖాళీలు
కాగా.. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే నే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు. ఈ శాఖలోని 7 హెచ్‌ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 గా తేల్చారు. అదే విధంగా ఉన్నత విద్యాశాఖలో 7 వేల పోస్టులు ఖాళీలు ఉండగా.. యూనివర్సిటీల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది.
కాగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో సుమారు 23 వేలకు నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యా భివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుండగా వీటిలో డీఆర్ పోస్టులు 2,400.పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26 వేల వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో మూడు వేల పోస్టులను ఇన్‌సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. ఖాళీల పైన అధికారికంగా స్పష్టత వచ్చిన తరువాత ప్రభుత్వం షెడ్యూల్ ఫిక్స్ చేసి ఉగాది నాడు అధికారికంగా విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.


































