భారతీయులు ఎగబడి కొంటున్న ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇది- సేల్స్​లో TVS iQube టాప్​! సక్సెస్​కి కారణాలు..

టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘టీవీఎస్ ఐక్యూబ్’ 2025 డిసెంబర్ నాటికి భారత మార్కెట్​లో 8 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఐక్యూబ్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న విక్రయాల జోరును గమనిస్తే, ఈ ఈవీ త్వరలోనే పది లక్షల (వన్ మిలియన్) యూనిట్ల విక్రయాల మార్కును దాటేస్తుందని అనడంలో సందేహం లేదు.


టీవీఎస్​ ఐక్యూబ్​- 8 లక్షల సేల్స్​..

జనవరి 2020లో మార్కెట్​లోకి వచ్చింది ఈ టీవీఎస్ ఐక్యూబ్. అప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 8.24 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి. అయితే, ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మొదటి ఒక లక్ష యూనిట్ల విక్రయాలను నమోదు చేయడానికి మూడు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. కానీ, తర్వాతి ఒక లక్ష యూనిట్ల విక్రయాలను కేవలం 10 నెలల్లోనే సాధించింది. ఏప్రిల్ 2024 నాటికి మూడు లక్షల యూనిట్ల హోల్‌సేల్ మైలురాయిని దాటింది.

ఆ తర్వాత ఐక్యూబ్ విక్రయాలు జెట్ స్పీడ్ అందుకున్నాయి! మూడు లక్షల యూనిట్ల నుంచి ఏడు లక్షల యూనిట్లకు చేరుకోవడానికి 17 నెలల సమయం పడితే, ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మార్కును కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయడం విశేషం.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ 8 లక్షల మైలురాయిని చేరుకోవడానికి కంపెనీకి ఆరేళ్ల సమయం పట్టింది.

టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​- సక్సెస్​కి కారణాలు..

  1. టీవీఎస్ ఐక్యూబ్: అసలు ఏం వర్కవుట్ అయ్యింది?

ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ప్రముఖ బ్రాండ్‌ల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, టీవీఎస్ ఐక్యూబ్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఆచరణాత్మకత, సరసమైన ధరలు, సంప్రదాయ డిజైన్‌తో కూడిన స్మార్ట్ ఫీచర్లు దీని విజయానికి ప్రధాన కారణం. వీటికి తోడు ‘టీవీఎస్’ బ్రాండ్‌పై ఉన్న విశ్వసనీయత కూడా ఈ ఈవీ వృద్ధికి ఎంతగానో తోడ్పడింది.

2. ప్రాక్టికాలిటీ- సౌకర్యం:

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్​ స్కూటర్​ డిజైన్ ఫిలాసఫీ సాధారణ పెట్రోల్ స్కూటర్లను పోలి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా వెడల్పాటి సీటు, విశాలమైన ఫుట్‌బోర్డ్, కొన్ని వేరియంట్లలో 32 లీటర్ల వరకు అండర్-సీట్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. స్పోర్టీ డిజైన్ కోసం ప్రాక్టికాలిటీని పక్కన పెట్టే ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ఇది ప్రత్యేకంగా నిలుస్తోంది. అలాగే, దీనిలోని ప్లష్ సస్పెన్షన్ సిస్టమ్ రకరకాల రోడ్డు పరిస్థితులను సునాయాసంగా తట్టుకుంటుందని రైడర్లు భావిస్తారు.

3. అన్ని వేరియంట్లలో సరసమైన ధరలు:

టీవీఎస్ ఐక్యూబ్ వివిధ రకాల బ్యాటరీ, ఫీచర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. ఇది 2.2 కేడబ్ల్యూహెచ్​ నుంచి 5.3 కేడబ్ల్యూహెచ్​ వరకు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందిస్తుంది. బడ్జెట్ వినియోగదారుల నుంచి ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారి వరకు అందరినీ ఆకట్టుకునేలా కంపెనీ ఈ వ్యూహాన్ని అమలు చేసింది. దీని ధరలు ఎక్స్-షోరూమ్ వద్ద సుమారు రూ. 94,000 నుంచి రూ. 1.58 లక్షల మధ్య ఉండటం వల్ల ఇది ఎక్కువ మందికి చేరువైంది.

ఈ టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ గరిష్ఠంగా 145 కి.మీ వరకు రేంజ్​ని ఇస్తుంది.

4. స్మార్ట్- ఉపయోగకరమైన ఫీచర్లు: టీవీఎస్ ఐక్యూబ్​లో అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. టర్న్-బై-టర్న్ నావిగేషన్, జియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లను మొబైల్ యాప్, స్కూటర్​లోని టీఎఫ్‌టీ డిస్​ప్లే ద్వారా పొందవచ్చు. ఇవి ఈవీ ఆకర్షణను మాత్రమే కాకుండా దాని వినియోగాన్ని కూడా పెంచుతున్నాయి.

5. నమ్మకమైన బ్రాండ్- విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్: కొత్త ఈవీ స్టార్టప్‌ల మాదిరిగా కాకుండా, టీవీఎస్ ఐక్యూబ్‌కు టీవీఎస్ మోటార్ కంపెనీకి ఉన్న దశాబ్దాల తయారీ అనుభవం, దేశవ్యాప్తంగా ఉన్న విస్తృతమైన డీలర్‌షిప్, సర్వీస్ నెట్‌వర్క్ పెద్ద అండగా నిలిచాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో వినియోగదారులకు ఉండే ‘ఆఫ్టర్ సేల్స్ సర్వీస్’ ఆందోళనలను ఈ నెట్‌వర్క్ దూరం చేస్తోంది.

5. ఖర్చులు తక్కువ: ఇతర ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే, టీవీఎస్ ఐక్యూబ్ కూడా పెట్రోల్ స్కూటర్ల కంటే తక్కువ నిర్వహణ ఖర్చును కలిగి ఉంటుంది. రన్నింగ్ కాస్ట్ పెట్రోల్​తో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, వినియోగదారులకు ఇది దీర్ఘకాలంలో లాభదాయకంగా మారుతోంది.

టీవీఎస్​ ఐక్యూబ్​కి వస్తున్న డిమాండ్​ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మేన్యుఫ్యాక్చరింగ్​ని పెంచనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.