అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)తో ఓ చారిత్రాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గూగుల్‌కు చెందిన అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడల్ ‘జెమిని 3 ప్రో’ (Gemini 3 Pro) ఇప్పుడు క్రికెట్ మైదానంలో చోటుచేసుకునే ప్రతి కదలికను విశ్లేషించి అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమైంది.
గూగుల్ సీఈవో ఆసక్తికర పోస్ట్
క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. “ఇకపై గూగుల్ మీ ‘గూగ్లీ’కి సాయం చేస్తుంది” అంటూ ఆయన క్రికెట్ పరిభాషలో చమత్కరించారు. సంక్లిష్టమైన క్రికెట్ సాంకేతికతను, వ్యూహాలను సామాన్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
జెమిని 3 ప్రో .. ఒక డిజిటల్ అనలిస్ట్
గూగుల్ జెమిని 3 ప్రో కేవలం ఒక సాధారణ సెర్చ్ ఇంజిన్ లాగా కాకుండా ఒక నిపుణులైన విశ్లేషకుడిలా పనిచేస్తుంది. లైవ్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీడియో దృశ్యాలను చూడటమే కాకుండా, కామెంటరీని కూడా నిశితంగా వింటుంది. మైదానంలో ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్ ఎలా ఉంది? బ్యాటర్ ఎలాంటి షాట్ ఆడాడు? బౌలర్ వేసిన బంతి స్వింగ్ అయిందా లేదా? వంటి విషయాలను క్షణాల్లో విశ్లేషించి, సాధారణ భాషలో ప్రేక్షకులకు వివరిస్తుంది. ఇది క్రికెట్ విశ్లేషణలో ఓ విప్లవాత్మక మార్పుగా చెప్పవచ్చు.
కీలక మలుపులు గుర్తింపు
సాధారణంగా ఓ క్రికెట్ మ్యాచ్‌లో ఎక్కడ ఆట మలుపు తిరిగింది అనేది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కానీ జెమిని ఏఐ ఒక సెగ్మెంట్‌లోని వీడియో, ఆడియో డేటాను ప్రాసెస్ చేయడం ద్వారా మ్యాచ్‌లో అత్యంత కీలకమైన క్షణాలను గుర్తిస్తుంది. ఆటగాళ్ల టెక్నిక్‌లలోని లోపాలను వివరించడమే కాకుండా, గెలుపోటములను నిర్ణయించే ‘టర్నింగ్ పాయింట్స్’ను హైలైట్ చేస్తుంది. దీనివల్ల సాధారణ అభిమానులు కూడా ఒక నిపుణుడి స్థాయిలో మ్యాచ్‌ను అర్థం చేసుకోగలరు.
ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం ఇదే..
ఈ భాగస్వామ్యం కేవలం విశ్లేషణలకే పరిమితం కాకుండా, గూగుల్‌కు చెందిన మొత్తం ఎకోసిస్టమ్‌ను క్రికెట్ అభిమానులకు చేరువ చేస్తుంది. ఆండ్రాయిడ్, గూగుల్ పే, గూగుల్ పిక్సెల్, జెమిని వంటి ఉత్పత్తుల ద్వారా మ్యాచ్ హైలైట్స్, ప్లేయర్ స్టోరీస్, విన్నింగ్ మూమెంట్స్‌ను నేరుగా యూజర్లకు అందిస్తుంది. ముఖ్యంగా మహిళల క్రికెట్‌కు మరింత ప్రాధాన్యత కల్పిస్తూ, స్పోర్ట్స్ యాక్సెసిబిలిటీని పెంచడం ఈ భాగస్వామ్యం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.

































