బియ్యం ఇచ్చే ATMలు వచ్చేస్తున్నాయి! అలా కార్డు పెట్టి ఇలా కిలోల లెక్క బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు

సాధారణంగా ATM అంటే ఏం గుర్తుకు వస్తుంది. ఎవరికైనా డబ్బులే గుర్తుకు వస్తాయి. అయితే ఇకపై ATM అంటే కేవలం డబ్బులు మాత్రమే కాదు. బియ్యం, గోధుమలు కూడా గుర్తుకు రావాలి.

ఎందుకంటే.. కార్డు పెడితే బియ్యం, గోధుమలు ఇచ్చే ATMలు కూడా వచ్చేస్తున్నాయి. బీహార్ ప్రభుత్వం ధాన్యం ATMలు మొదటి సెట్‌ను ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద పాట్నాలో మూడు ధాన్యం ATMలు ప్రారంభం కానున్నాయి. దేశంలో మొట్టమొదటి ధాన్యం ATM ఆగస్టు 2024లో ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఏర్పాటు చేశారు.


గ్రెయిన్ ఏటీఎం అనేది జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద లబ్ధిదారులకు బియ్యం, గోధుమ వంటి ఆహార ధాన్యాలను పంపిణీ చేసే ఆటోమేటెడ్ యంత్రం. లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డును ఉపయోగించి తమ ఐడెంటిటీ నిర్ధారణ అయిన తర్వాత, అవసరమైన ధాన్యం రకం, పరిమాణాన్ని ఎంచుకుంటారు. ఆ యంత్రం తరువాత ధాన్యాలను పంపిణీ చేస్తుంది. లావాదేవీ నమోదు చేసి, లబ్ధిదారుడి ఖాతా అప్డేట్‌ అవుతుంది. ఒక గ్రెయిన్ ATM ఐదు నిమిషాల్లో 50 కిలోల వరకు ధాన్యాన్ని పంపిణీ చేయగలదు. ఇది గంటకు 0.6 వాట్స్ మాత్రమే వినియోగించేలా రూపొందించారు. సౌర ఫలకాలు, ఇన్వర్టర్ల సహాయంతో నడపవచ్చు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా ధాన్యం ఏటీఎంను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతి కోరింది. మేము దీనికి అనుమతి ఇచ్చాం. ఇప్పుడు పాట్నా (పట్టణ ప్రాంతం)లో మూడు ప్రదేశాలను గుర్తిస్తున్నాం అని ఆహార, వినియోగదారుల రక్షణ శాఖ కార్యదర్శి అభయ్ కుమార్ సింగ్ అన్నారు. రెండు-మూడు నెలల్లో ప్రారంభం కానున్న పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ యంత్రాలను ఇతర జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు. బీహార్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) కింద 8.5 కోట్లకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. 50,000 కంటే ఎక్కువ PDS దుకాణాలు ఉన్నాయి. ధాన్యం ATMలు PDS దుకాణాల నుండి ధాన్యాల అక్రమ రవాణాను అరికట్టగలవని భావిస్తున్నారు. అందుకే ధాన్యం ATMలు తీసుకొచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.