భారీ శతకం బాదిన ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్‌.. భారీ ట్రోలింగ్‌

అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడు ఫైసల్‌ షినోజాదా భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఐర్లాండ్‌తో ఇవాళ (జనవరి 30) జరిగిన మ్యాచ్‌లో 142 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 163 పరుగులు చేశాడు.

ఫైసల్‌తో పాటు కెప్టెన్‌ మహబూబ్‌ ఖాన్‌ (89) కూడా సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 315 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.


అనంతరం భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ఆఫ్ఘన్‌ బౌలర్లు చెలరేగిపోయారు. కలిసికట్టుగా రాణించి ఐర్లాండ్‌ను 40.4 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూల్చారు. తద్వారా ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు 191 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆఫ్ఘనిస్తాన్‌ గ్రూప్‌ 1 (సూపర్‌ సిక్స్‌) నుంచి సెమీఫైనల్‌ (ఆస్ట్రేలియాతో పాటు) బెర్త్‌ ఖరారు చేసుకుంది.

ఈ గెలుపుతో అప్పటిదాకా సెమీస్‌ రేసులో ఉండిన శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ గ్రూప్‌ నుంచి వెస్టిండీస్‌, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌ కూడా ఇంటిముఖం పట్టాయి. గ్రూప్‌-2 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్‌ ఒక్కటే ఇప్పటివరకు సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. మరో బెర్త్‌ కోసం భారత్‌, పాకిస్తాన్‌ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే జట్లు నిష్క్రమించాయి.

ఇదిలా ఉంటే, ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో భారీ శతకం బాదిన ఫైసల్‌ షినోజాదాపై సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ జరుగుతుంది. ఫైసల్‌ను చూసిన వారు ఇతను 17 ఏళ్ల పిల్లాడేంటీ అని అవాక్కవుతున్నారు. వయసు తక్కువగా చూపించుకొని, తప్పుడు ధృవపత్రాలతో అతను అండర్‌-19 విభాగంలో ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా పాకిస్తాన్‌ ఆటగాళ్ల విషయంలో ఇలాంటి ట్రోలింగ్‌ జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఆఫ్ఘనివస్తాన్‌ ఆటగాడు దీనికి బలయ్యాడు. వాస్తవానికి ఫైసల్‌ను చూస్తే నిజంగానే ఎవరూ 17 ఏళ్ల కుర్రాడంటే ఒప్పుకోరు. అతని ఆహార్యం మధ్యవయస్కుడిలా కనిపిస్తుంది. భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ కూడా ఇలాంటి ట్రోలింగ్‌నే ఎదుర్కొన్నాడు. అతను భారీ షాట్లు ఆడే విధానం చూసి, గిట్టని వారు వ్యతిరేక కామెంట్లు చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.