ఉదయం సూర్యకాంతిని మిస్ అవుతున్నారా? అది మీ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం!

ఆధునిక జీవనశైలిలో చాలా మంది రాత్రి ఆలస్యంగా నిద్రపోతూ, ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు.


ఫలితంగా ఉదయం వచ్చే సహజ సూర్యకాంతిని పూర్తిగా కోల్పోతున్నారు. అలారం మోగగానే లేచి, హడావుడిగా సిద్ధమై నేరుగా ఆఫీసుకు వెళ్లిపోవడం చాలా మందికి రొటీన్‌గా మారింది. ఆఫీసుల్లో రోజంతా స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల చిన్నప్పట్లో అనుభవించిన ఉదయపు సూర్యకాంతి ఇప్పుడు మన జీవితాల్లో కనుమరుగైంది.

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ మాటల్లో, ఉదయం వచ్చే సూర్యకాంతి శరీరానికి, మనసుకు సహజ ఔషధంలా పనిచేస్తుంది. ప్రతిరోజూ కొద్ది నిమిషాలు అయినా ఉదయపు ఎండలో గడిపితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు.

గురుగ్రామ్‌లోని ఆర్టెమిస్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పీ. వెంకట కృష్ణ TOIకి వెల్లడించిన వివరాల ప్రకారం, మన శరీరం ‘సర్కేడియన్ రిథమ్’ అనే బయోలాజికల్ క్లాక్‌ను అనుసరించి పనిచేస్తుంది. ఇది మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, శరీరంలో ఏ హార్మోన్లు విడుదల కావాలనే విషయాలను నియంత్రిస్తుంది.

ఉదయపు సూర్యకాంతి కళ్ల ద్వారా మెదడుకు చేరి రోజు ప్రారంభమైందని సంకేతమిస్తుంది. దీని వల్ల ‘సెరటోనిన్’ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గించి, ఉత్సాహం, పాజిటివిటీని పెంచుతుంది. అంతేకాదు, ఏకాగ్రత కూడా మెరుగవుతుంది.

డాక్టర్ల మాటల్లో, ఉదయం ఎండ తగలడం వల్ల పగటిపూట శక్తి పెరుగుతుంది, రాత్రి నిద్ర కూడా నాణ్యంగా వస్తుంది. పగటిపూట తయారయ్యే సెరటోనిన్ హార్మోన్ రాత్రికి మెలటోనిన్‌గా మారి గాఢమైన నిద్రకు సహాయపడుతుంది. సరైన సూర్యకాంతి అందని వారిలో నిద్రలేమి, చిరాకు, సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ వంటి డిప్రెషన్ సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు, ఉదయపు సూర్యకాంతి విటమిన్ డీకి సహజ వనరు. ఇది ఎముకల ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. రక్తపోటును నియంత్రించడం, రక్తనాళాలను లవచంగా ఉంచడం, రక్తప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్‌ను తగ్గించడంలో సూర్యకాంతి సహాయపడుతుంది. దీని స్థాయి ఎక్కువగా ఉంటే బీపీ, వాపు, హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచన ప్రకారం, ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వచ్చే సూర్యకాంతి అత్యంత ప్రయోజనకరమైనది. ఈ సమయంలో కిరణాలు మితంగా ఉండి హానికరం కావు. రోజూ 15 నుంచి 30 నిమిషాలు ఓపెన్ ఏరియాలో కూర్చోవడం లేదా నడక చేయడం శరీరానికి, మెదడుకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.

మీ రోజువారీ జీవితంలో ఉదయపు సూర్యకాంతిని భాగం చేస్తే, అది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేసే దేశీ ఔషధంలా మారి, మిమ్మల్ని ఆరోగ్యంగా, ఉత్సాహంగా, సంతోషంగా ఉంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.