రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న వారణాసి రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ రిలీజ్ డేట్ కాశీలో హోర్డింగ్స్ రూపంలో లీకైన మరుసటి రోజే రాజమౌళి దీనిని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం.
మహేష్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7నే ఈ సినిమా రానుంది. ఈ విషయాన్ని రాజమౌళియే అనౌన్స్ చేశాడు. కాశీలో హోర్డింగ్స్ పై ఈ సినిమా రిలీజ్ డేట్ నే లీక్ చేశారని వార్తలు వచ్చిన మరుసటి రోజే అధికారిక ప్రకటన వచ్చేసింది.
వారణాసి రిలీజ్ డేట్
ఎంతగానో ఎదురు చూస్తున్న వారణాసి మూవీ రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7నే రానున్నట్లు రాజమౌళి ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో ఓ ఉల్క వచ్చి భూమిని ఢీకొడుతున్నట్లుగా ఉంది. అది నంబర్ 7 రూపంలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా అదే రోజు రిలీజ్ అవుతున్నట్లు రాజమౌళి చెప్పాడు.
వారణాసిలో హోర్డింగ్స్
నిజానికి వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రానున్నట్లు కాశీలో హోర్డింగ్స్ వెలిసిన విషయం తెలిసిందే. ఇందులో మూవీ పేరు లేకపోయినా.. ఆ పోస్టర్ థీమ్ చూసి ఫ్యాన్స్ ఇదే సినిమా అని ఫిక్సయ్యారు. దీంతో మేకర్స్ ఇప్పుడు అధికారికంగా అదే డేట్ వెల్లడించాల్సి వచ్చింది.
వచ్చే ఏడాది అదే రోజు ఉగాది పర్వదినం కానుంది. దీంతో వారణాసి తెలుగు సంవత్సరాదిన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. గతేడాది చివర్లో మూవీ టైటిల్ ను గ్రాండ్ గా రివీల్ చేసిన రాజమౌళి.. రిలీజ్ డేట్ ను మాత్రం సింపుల్ గా ఓ ట్వీట్ తో చెప్పేశాడు.
వారణాసి మూవీ విశేషాలు
మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి రేర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వారణాసి. గతేడాదే షూటింగ్ మొదలైంది. మామూలుగానే రాజమౌళి మూవీస్ ఏళ్లకు ఏళ్లు షూటింగ్ స్థాయిలోనే ఉంటాయి. ఇది కూడా భిన్నమేమీ కాదు. ఆమధ్య అవతార్ 3 రిలీజ్ సందర్భంగా జేమ్స్ కామెరాన్ తో రాజమౌళి మాట్లాడుతూ.. మరో 8 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పాడు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా అతడు చాలా టైమే తీసుకుంటాడు. ఏకంగా రూ.1300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ మూవీని నిర్మిస్తున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.

































