ప్రస్తుత కాలంలో చాలామంది కంప్యూటర్ల ముందు పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. వీరు గంటల తరబడి కూర్చొని పనిచేస్తుంటారు. ప్రతి రంగంలో కంప్యూటర్ తప్పనిసరిగా వాడుతుండడంతో ఒక్కోసారి కొన్ని పనుల కోసం తీరిక లేకుండా టైపింగ్ చేయాల్సి వస్తుంది. అయితే కంప్యూటర్ పై టైప్ చేసే వ్యక్తులు ఇటీవల చాలా వరకు అనారోగ్యాల బారిన పడుతున్నారు. వీరికి చేతి మణికట్టు సమస్యలతో పాటు మెడ నొప్పులు, బాడీపెయిన్స్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఇవి రావడానికి కంప్యూటర్ ముందు సరిగా కూర్చోలేకపోవడమే అని అంటున్నారు. కంప్యూటర్ ముందు సరైన రీతిలో కూర్చుంటే ఎలాంటి అలసట ఉండదని అంటున్నారు. అయితే ప్రస్తుతం కంప్యూటర్ ముందు కూర్చునే వారిలో ఏ స్థాయిలో ఉన్నారు? ఏ స్థాయిలో ఉంటే ఆరోగ్య సమస్యలు ఉండవు? అనే వివరాల్లోకి వెళ్తే..
కంప్యూటర్ ముందు కీబోర్డ్ టైపింగ్ చేసే వారిలో తరచుగా కొన్ని ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వీరిలో కార్బన్ టన్నెల్ సిండ్రోమ్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే మణికట్టు పై ఒత్తిడి వల్ల చేతిలో నొప్పి, మంట, వేళ్లలో నొప్పి వస్తుంటాయి. అలాగే చేతులు, భుజాలలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. కీబోర్డు చాలా ఎత్తులో లేదా చాలా కిందికి ఉండడంవల్ల భుజాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా క్రానిక్ పెయిన్ గా మారుతుంది. టైపింగ్ చేసే సమయంలో ముందుకు వంగడం వల్ల సర్వైకల్ స్పెయిన్, లోయర్ బ్యాక్ సమస్యలు వస్తాయి. అలాగే త్వరగా అలసిపోవడం, ఉత్పాదక తగ్గడం వంటివి ఎక్కువగా ఉంటాయి. కండరాలు ఎక్కువగా శక్తి ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే నరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు కంప్యూటర్ ముందు తప్పుడు భంగిమలో కూర్చుంటే నరాలపై ఒత్తిడి పెరిగి చేతులు మొద్దు మారడం వంటివి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆహారంపై శ్రద్ధ ఉండదు. దీంతో అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అయితే ఈ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల పద్ధతులను అవలంబించాలి. ముఖ్యంగా కంప్యూటర్ ముందు కూర్చునే సమయంలో మోచేతులు సుమారు 90 నుంచి 100 డిగ్రీల కోణంలో ఉండాలి. కీబోర్డు ఎత్తు మోచేతుల స్థాయిలో లేదా కొంచెం తక్కువగా ఉండాలి. చేతి మణికట్టులు నేరుగా ఉండాలి. పైకి లేదా కిందికి ఎక్కువగా వంగకూడదు. కీబోర్డు సాధ్యమైనంతవరకు ప్లాటుగా లేదా స్వల్పంగా నెగిటివ్ టిల్టులో ఉండాలి. కీబోర్డ్ శరీరం మధ్య సుమారు ఐదు నుంచి పది సెంటీమీటర్ల దూరం ఉండాలి. దీంతో భుజాలు వంగకుండా ఉంటాయి.
ఈ విధంగా కంప్యూటర్ ముందు కూర్చునేవారు క్రమ పద్ధతిలో టైప్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా భవిష్యత్తులోనూ దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.


































