ప్లాస్టిక్ ఉత్పత్తి-వ్యర్థాల ప్రభావం: 2040 హెచ్చరిక ఇదే

ప్లాస్టిక్ ఇది ఈ రోజుల్లో మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో మనం ప్లాస్టిక్‌ను వాడుతూనే ఉన్నాం.


అయితే ఈ సౌకర్యం వెనుక ఒక పెను విపత్తు పొంచి ఉందని తాజా అంతర్జాతీయ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 2040 నాటికి మనం ఎదుర్కోబోయే పరిస్థితులు వింటే ఒంట్లో వణుకు పుడుతుంది. పర్యావరణమే కాదు, మన ఆరోగ్యం కూడా ప్లాస్టిక్ మయం కాబోతున్న ఈ భయంకర హెచ్చరికల గురించి తెలుసుకొని జాగర్త వహిద్దాం..

2040 నాటికి రెట్టింపు కానున్న ముప్పు: గ్లోబల్ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే 2040 నాటికి ప్లాస్టిక్ ఉత్పత్తి మరియు వ్యర్థాల కాలుష్యం దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఏటా పర్యావరణంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు 130 మిలియన్ టన్నుల నుండి 280 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

అంటే ప్రతి సెకనుకు ఒక చెత్త లారీ ప్లాస్టిక్ సముద్రాల్లోకి లేదా భూమిలోకి వెళ్తున్నట్లు లెక్క. ఉత్పత్తి సామర్థ్యం పెరిగినంత వేగంగా వ్యర్థాల నిర్వహణ జరగకపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, భూగోళం అంతటినీ చుట్టుముట్టే ఒక వ్యవస్థాగత సంక్షోభం.

ఆరోగ్యంపై ప్లాస్టిక్ పంజా: ప్లాస్టిక్ కాలుష్యం కేవలం సముద్ర జీవులనే కాదు, నేరుగా మనిషి ఆయుష్షునే దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్ తయారీలో వెలువడే విషవాయువులు, మైక్రోప్లాస్టిక్ రేణువుల వల్ల 2040 నాటికి క్యాన్సర్, గుండె జబ్బులు మరియు శ్వాసకోశ సమస్యలు 75 శాతం మేర పెరిగే ప్రమాదం ఉందని ‘ప్యూ చారిటబుల్ ట్రస్ట్’ నివేదిక హెచ్చరించింది.

మనం పీల్చే గాలిలో, తాగే నీటిలో, ఆఖరికి మన రక్తంలో కూడా ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఇప్పటికే చేరుకున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం వల్ల వచ్చే పొగ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్‌ను పెంచి, వాతావరణ మార్పులను మరింత వేగవంతం చేస్తాయి. ఇది రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని దూరం చేసే అవకాశం ఉంది.

పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ, మార్పు మనతోనే మొదలవ్వాలి. 2040 నాటికి ఈ ముప్పును తగ్గించాలంటే ప్లాస్టిక్ ఉత్పత్తిని నియంత్రించడం, రీసైక్లింగ్ ప్రక్రియను బలోపేతం చేయడం మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించడం ఏకైక మార్గం. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తేవడంతో పాటు, పౌరులుగా మనం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.