ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నియోజకవర్గ పర్యటనలో భాగంగా సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఒకేసారి 5,555 మంది డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్లను పంపిణీ చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
ఈ అరుదైన మైలురాయికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని గిన్నిస్ ప్రతినిధుల నుంచి జిల్లా కలెక్టర్ అందుకున్నారు.
స్వయంగా సైకిల్ తొక్కిన సీఎం
ఈ కార్యక్రమం సందర్భంగా శివపురం నుంచి ప్రజావేదిక వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ-సైకిల్ ర్యాలీలో చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. భారీ సంఖ్యలో మహిళలతో కలిసి ఆయన సైకిల్ తొక్కుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలోనూ ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారు.. అందుకే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నాం” అని పేర్కొన్నారు.
ఉచిత ఛార్జింగ్: ఈ సైకిళ్ల ప్రత్యేకత ఏంటంటే, ఇంటిపై ఏర్పాటు చేసుకునే సోలార్ విద్యుత్ ద్వారానే వీటికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.
ఆర్థిక ప్రయోజనం: ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఈ సైకిళ్లు దూసుకెళ్తాయని, ఇది మహిళల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని ఆయన వివరించారు.
మహిళా సాధికారత: కుప్పం నుంచి మొదలైన ఈ విప్లవం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న పథకాలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

































