ఇది చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత రక్తంలో దాగుతుంది. దీని గుడ్లు కాలేయం, ఊపిరితిత్తులు జననేంద్రియాల్లోకి చేరతాయి. అలా ఏళ్ల తరబడి బయటపడకుండా శరీరంలోనే తిష్ట వేసుకుంటుంది.
స్నెయిల్ ఫీవర్. పెద్దగా పట్టించుకోని ఈ పరాన్న జీవి వ్యాధి నియంత్రించడం కష్టమయ్యే రీతిలో పరిణామం చెందుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఏటా ఈ వ్యాధికి చికిత్స తీసుకునే 25 కోట్ల మందిలో ఎక్కువ మంది ఆఫ్రికాలోనే నివసిస్తున్నారు.
ఎందుకంటే, ఈ పరాన్నజీవులను మోసుకొచ్చే దేశీయ నత్తలు అక్కడే పెరుగుతున్నాయి.
అయితే ఇప్పుడీ పరాన్నజీవి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కేసులు చైనా, వెనెజ్వెలా, ఇండోనేషియాతో పాటు 78 దేశాల్లో నమోదయ్యాయి.
ఈ పరాన్నజీవి జన్యుపరివర్తన చెందుతూ , కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందని పరిశోధనలు వెల్లడించిన తరువాత ”అంతర్జాతీయంగా ఆందోళన” కలిగించే పరిణామమిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
‘విస్మరణకు గురవుతున్న ఉష్ణమండల వ్యాధుల దినోత్సవం’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ హెచ్చరిక చేసింది.
పేద ప్రాంతాల్లో నివసిస్తున్న 100 కోట్ల కంటే ఎక్కువ మందిపై వైరస్‌లు, బ్యాక్టీరియాలు, పరాన్నజీవులు, ఫంగస్‌ల వల్ల కలిగే అనారోగ్య ప్రభావాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా డబ్ల్యూహెచ్ఓ ఈ డేను నిర్వహిస్తోంది.
కొన్ని రకాల నత్తల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధే స్నెయిల్ ఫీవర్. ఈ నత్తలు విడుదల చేసిన లార్వాలున్న నీటిలోకి మనుషులుగానీ, జంతువులు గానీ దిగినప్పుడు, ఈ లార్వాలు ఎంజైములను విడుదల చేస్తాయి. అవి చర్మం ద్వారా శరీరంలోకి చొరబడతాయి.
ఆ తర్వాత పెద్దపెద్ద పురుగులుగా మారి, రక్తనాళాల్లో తిష్ట వేస్తాయి. ఆడపురుగులు గుడ్లను పెడతాయి.
ఈ గుడ్లు కొన్నిసార్లు మలం లేదా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి. మిగిలినవి శరీర కణజాలంలో ఉండిపోతాయి.
ఈ గుడ్లపై మన శరీర రోగ నిరోధక వ్యవస్థ జరిపే పోరాటంలో పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల అవయవాలు పాడవవచ్చు.
కొన్ని గుడ్లు పెల్విక్ ఆర్గాన్ల చుట్టూ, లేదా లోపల చిక్కుకుపోతాయి. దీన్నే ”యూరోజెనిటల్ షిస్టోసోమియాసిస్” అంటారు. దీనివల్ల పొత్తి కడుపులో నొప్పి, క్యాన్సర్ లాంటివి సోకడంతోపాటు తీవ్రమైన సందర్భంలో ప్రాణాలు కూడా పోవచ్చు.
యాంటీ-పారాసైటిక్ మందులు వేసుకోవడం వల్ల స్నెయిల్ ఫీవర్ తగ్గుతుంది. పిల్లలు, రైతులు, మత్స్యకారులకు ఈ జీవి వల్ల ఎక్కువ ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
యాంటీ-పారాసైటిక్ మందులను వరుసగా కొన్నేళ్ల పాటు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది.
అయితే, ప్రస్తుత చికిత్స విధానాలతో ఈ పరాన్నజీవి కొత్త రూపాలను కనుగొనలేమని మలావి లివర్‌పూల్ వెల్‌కమ్ క్లినికల్ రీసెర్చ్ ప్రొగ్రామ్ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ జెనెలిసా ముసాయా చెబుతున్నారు.
రూపు మార్చుకున్న పరాన్న జీవుల గుడ్లు మైక్రోస్కోప్‌లో కూడా కనిపించవు.
‘ఇది కేవలం ప్రారంభం మాత్రమే’
ఈ వ్యాధులు లేదా అనారోగ్యాలు తరచుగా ఎందుకు వ్యాపిస్తున్నాయి? అనే దానిపై పరిశోధనలు కీలక విషయాలను వెల్లడిస్తున్నాయి.
మానవులకు, జంతువులకు చెందిన పరాన్నజీవులు ఒకదానికొకటి సంపర్కం చెందుతున్నాయని, దీనివల్ల కొత్త రకం ‘హైబ్రిడ్’ వెర్షన్లు పుట్టుకు వస్తున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ హైబ్రిడ్ రకానికి చెందిన పరాన్నజీవులు మనుషులకు, జంతువులకు రెండింటికీ సోకుతున్నాయి. వీటి వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టం.
ఇలా జరుగుతుందని నిరూపించేందుకు, ఎంపిక చేసిన మలావి కమ్యూనిటీల్లో ప్రజల నుంచి, జంతువుల నుంచి నమూనాలను సేకరించారు.
ఈ పరీక్షల్లో 7 శాతం పరాన్నజీవులు మ్యూటెడ్ హైబ్రిడ్ రకానికి చెందినవని తేలింది. ఇది వారు అంచనావేసిన దానికంటే చాలా ఎక్కువ.
అంటే. జన్యు పరివర్తన చెందిన పరాన్నజీవులు బాగా పెరుగుతూ, అవి ఇతరులకు వ్యాపిస్తున్నాయి.
”ఒకవేళ ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందుతూ పోతే, ఇది అతిపెద్ద సమస్యగా మారుతుంది” అని ముసాయా చెప్పారు.
తమ టీమ్ కేవలం కొన్ని ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించినందున, ఈ సమస్య మరింత పెద్దదిగా ఉండొచ్చని తెలిపారు.
ముఖ్యంగా ప్రస్తుత పరీక్షలు అన్ని వేళలా కచ్చితంగా గుర్తించలేకపోతున్నాయని చెబుతూ, ఇది కేవలం ఆరంభం కూడా అవ్వొచ్చని అన్నారు.
భవిష్యత్‌లో కొత్తగా పుట్టుకొచ్చే పరాన్నజీవులు, మునపటి పరాన్నజీవుల కంటే అత్యంత శక్తివంతమైనవిగా కూడా ఉండొచ్చని ముసాయా హెచ్చరించారు.
అప్పుడు చాలా పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే, హైబ్రిడ్ పారాసైట్లకు ఎలా చికిత్స చేయాలో ప్రస్తుతం వైద్యులకు అర్థం కావడం లేదన్నారు.
”మేం ప్రభుత్వానికి చెబుతున్నాం, ‘మేల్కోండి, ముందుగానే దీనిపై దృష్టి పెట్టండి, ఈ సమస్య మరింత పెద్దదిగా కాకముందే, తక్షణమే ఏదైనా చేయగలమా?” అని కోరుతున్నట్లు తెలిపారు.
హైబ్రిడ్ పరాన్న జీవులు జననావయవాల వద్ద ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతున్నాయి. హైబ్రిడ్ రకాల వల్ల వచ్చే స్నెయిల్ ఫీవర్‌ను గుర్తించడం కష్టం. ఎందుకంటే వాటి గుడ్లు సాధారణ పరాన్న జీవుల గుడ్ల మాదిరిగా మైక్రోస్కోప్ కింద కనిపించవు.
వైద్యులు కూడా కొన్ని సందర్భాల్లోఈ వ్యాధుల్ని లైంగిక సంక్రమణ వల్ల వచ్చిన వ్యాధులుగా పొరపడే అవకాశం ఉంది.
యూరోజెనిటల్ సిస్టోయోమైసిస్‌కు చికిత్స అందించకపోతే జననేంద్రియాల వద్ద గాయాలు, సంతానలేమి, హెచ్‌ఐవీకి దారి తీయవచ్చు.
మహిళల విషయంలో దీని వల్ల వైద్య, సామాజిక పరమైన పరిస్థితులు, పునరుత్పత్తి పరిణామాలు దారుణంగా మారతాయి.
“మహిళలు పిల్లల్ని కనే అవకాశం లేకపోతే, మన సంస్కృతిలో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. పిల్లల్ని కనడం మన సంస్కృతిలో చాలా ముఖ్యం. పిల్లలు పుట్టకపోతే అందరూ రకరకాలుగా మాట్లాడతారు. ఇది చాలా విషాదకరమైన, ప్రమాదకరమైన వ్యాధి” అని ముసాయా చెప్పారు.
వ్యాధి నివారణ లక్ష్య సాధనకు నిధుల కొరత పెద్ద సమస్యగా మారింది.
నిధుల సమస్య
శరీరంలోని కొత్త ప్రాంతాల్లో వ్యాధులు స్థిరపడటానికి హైబ్రిడ్ పరాన్న జీవులు సాయపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వాతావరణ మార్పులు, ప్రయాణికులు, వలసలు లాంటి వల్ల స్నెయిల్ ఫీవర్ విస్తరిస్తోంది. సంకరం చెందిన పరాన్న జీవుల వల్ల దీన్ని నియంత్రించడం చాలా కష్టమవుతోంది.
దక్షిణ యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే హైబ్రిడ్ పరాన్నజీవుల వ్యాప్తి కేసులు నమోదయ్యాయి.
“ఇది అంతర్జాతీయంగా ఆందోళన చెందాల్సిన అంశం” అని డబ్ల్యూహెచ్‌ఓలో సిస్టోసోమియోసిస్ నియంత్రణ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ అమడౌ గర్బా జిర్మే చెప్పారు
హైబ్రిడ్ పరాన్నజీవులు వ్యాధుల నిర్మూలనా లక్ష్యాలను ప్రభావితం చేస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన చెందుతోంది.
“మనుషుల్లో ఈ వ్యాధి సంక్రమించని దేశాలు ఉన్నాయి. అయితే ఆ దేశాల్లో కూడా ఈ పరాన్న జీవి జంతువుల్లో ఉండటాన్ని మేం గుర్తించాం. ఇది మనుషులకు ప్రమాదకరంగా మారవచ్చు” అని జిర్మే అన్నారు.
కొత్తగా వచ్చిన ముప్పును లక్ష్యంగా చేసుకుని డబ్ల్యూహెచ్‌ఓ తన ఆచరణను మార్చుకుంటోంది.
హైబ్రిడ్ పరాన్న జీవుల గురించి ఇప్పటికే ప్రపంచ దేశాలకు హెచ్చరిక జారీ చేసింది. జంతువుల్లో ఈ వ్యాధిని నియంత్రించేందుకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది
భారీ స్థాయిలో చేపట్టిన పరాన్న జీవుల నివారణ కార్యక్రమాల వల్ల 2006-2024 మధ్య స్నెయిల్ ఫీవర్ కేసులు 60 శాతం తగ్గాయి.
అయితే ఈ పురోగతిని కొనసాగించడానికి నిధులు అవసరం. 2018-2023 మధ్య ఈ వ్యాధి నివారణకు కేటాయిస్తున్న నిధులు 41శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ఈ వ్యాధిని దాని ప్రారంభ దశలోనే అరికట్టే విషయంలో ముసాయా ఇప్పటికీ ఆశావహంగా ఉన్నారు.
“మనం దీన్ని పూర్తిగా తరిమేయవచ్చు. అయితే అది అది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. మనమంతా సానుకూలంగా ఉండాలి. దీన్ని మనమంతా కలిసి ఎదుర్కొందామని చెబుతున్నాం” అని తెలిపారు.



































