క్రెడిట్ కార్డుల (Credit Card) వినియోగంపై బ్యాంకులు క్రమంగా కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్లు, వినోదం, రవాణా, ఆన్లైన్ గేమింగ్ వంటి విభాగాల్లో పెరుగుతున్న ఖర్చులు, రిస్క్‌ను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానున్నాయి.
ఈ మార్పులు లక్షలాది క్రెడిట్ కార్డ్ యూజర్ల జేబుపై నేరుగా ప్రభావం చూపనున్నాయి. అయితే, అన్ని బెనిఫిట్స్ రద్దు కాలేదు. కొన్ని కీలక ఫీచర్లు యథాతథంగా కొనసాగనున్నాయి.
ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ మూవీ టిక్కెట్ బెనిఫిట్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు బుక్‌మైషో ద్వారా ఫ్రీ లేదా డిస్కౌంట్‌తో సినిమా టిక్కెట్లు పొందిన యూజర్లకు ఇక ఆ సౌకర్యం ఉండదు. ముఖ్యంగా ICICI Instant Platinum Chip Credit Card వంటి కార్డులపై ఈ ఫీచర్ పూర్తిగా తొలగించనున్నారు.
Credit Card రివార్డ్ పాయింట్లు కట్..
క్యాబ్‌లు, మెట్రో, రైల్వే, ఇతర ట్రాన్స్పోర్ట్ సేవలకు క్రెడిట్ కార్డును వాడే వారికి కొత్త పరిమితులు విధించారు. ప్రీమియం కార్డులైన రూబిక్స్, సఫిరో, ఎమరాల్డ్ వంటి వాటిపై నెలకు గరిష్టంగా రూ. 20 వేల వరకు మాత్రమే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇతర కార్డులపై ఈ పరిమితి రూ. 10 వేల వరకుగా నిర్ణయించారు. ఆ మొత్తాన్ని మించి ఖర్చు చేసినా, అదనపు రివార్డ్ పాయింట్లు మాత్రం రావు.
ఇన్సూరెన్స్ చెల్లింపులపై ఊరట
అయితే, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల విషయంలో మాత్రం యూజర్లకు రిలీఫ్ ఉంది. ICICI HPCL Super Saver Credit Card వినియోగదారులు గతంలో మాదిరిగానే రూ. 40 వేల వరకు బీమా ప్రీమియం చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ఈ విభాగంలో ఎలాంటి కోత లేదు.
ఆన్లైన్ గేమింగ్‌పై భారీ ఛార్జీలు
డ్రీమ్11, MPL, రమ్మీ కల్చర్ వంటి ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు క్రెడిట్ కార్డు ద్వారా డబ్బు జమ చేస్తే ఇప్పుడు అదనపు భారం పడనుంది.
జనవరి 15, 2026 నుంచి ప్రతి గేమింగ్ లావాదేవీపై 2 శాతం ఛార్జీ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో మరిన్ని గేమింగ్ యాప్స్‌ను కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
- క్రెడిట్ కార్డు ఉపయోగించి పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే, మొబిక్విక్, ఫ్రీఛార్జ్, ఓలామనీ వంటి వాలెట్లలో డబ్బు లోడ్ చేస్తే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
- రూ. 5 వేలకుపైగా వాలెట్ రీఛార్జ్ చేస్తే 1 శాతం ఛార్జీ వర్తిస్తుంది.
- ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఒక కస్టమర్ నెలలో రూ. 50 వేలకుపైగా ఖర్చు చేస్తే, ఆ అదనపు మొత్తంపై 1 శాతం ఛార్జీ విధించనున్నారు.

































