భూమిపై గ్రాండ్ కాన్యన్ (Grand Canyon) గురించి అందరికీ తెలుసు. కానీ అదే స్థాయిలో ఆశ్చర్యపరచే ఒక మహా భౌగోళిక అద్భుతం సముద్రపు లోతుల్లో దాగి ఉందంటే నమ్మగలరా?
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) అడుగున, పోర్చుగల్ తీరం నుంచి సుమారు 300 మైళ్ల దూరంలో విస్తరించి ఉన్న కింగ్స్ ట్రో కాంప్లెక్స్ అనే విస్తారమైన లోతైన కందకాల వ్యవస్థ ఇప్పుడు శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేస్తోంది. దీని తూర్పు అంచున ఉన్న పీక్ డీప్ ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర లోయలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భూమిపై లోయలు ప్రధానంగా నీటి కోత వల్ల ఏర్పడతాయి. కానీ సముద్రపు అడుగున అలాంటి శక్తి లేదు. మరి కింగ్స్ ట్రో లాంటి మహా నిర్మాణం ఎలా ఏర్పడింది? ఈ ప్రశ్నే దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధించిన పజిల్. ఇప్పుడు ఆ పజిల్‌కు సమాధానం దొరికింది.
ప్రతిష్ఠాత్మక శాస్త్రీయ జర్నల్ ‘Geochemistry, Geophysics, Geosystems’లో ప్రచురితమైన తాజా అధ్యయనం ఈ రహస్యానికి తెరతీసింది. టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు, భూమి లోపలి మాంటిల్ నుంచి వచ్చిన అధిక వేడి.. ఈ రెండింటి అరుదైన కలయికే కింగ్స్ ట్రో ఏర్పాటుకు కారణమని పరిశోధకులు నిర్ధారించారు. ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ఆంట్యే డ్యూర్క్‌ఫాల్డెన్ మాట్లాడుతూ, “భూమి క్రస్ట్ కదలికలే కింగ్స్ ట్రో రూపకల్పనలో కీలక పాత్ర పోషించాయి. ఈ భారీ నిర్మాణం ఇక్కడే ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్నకు మా పరిశోధన తొలిసారి స్పష్టమైన సమాధానం ఇచ్చింది” అని తెలిపారు.
కింగ్స్ ట్రో ఒకే లోయగా కాకుండా, సముద్రపు క్రస్ట్‌లో చెక్కబడిన అనేక సమాంతర కందకాలు, లోతైన బేసిన్‌ల సమాహారంగా ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సబ్‌మేరైన్ కాన్యన్ వ్యవస్థలలో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది. టెక్టోనిక్ సరిహద్దులకు దూరంగా ఉండటం వల్ల దీని ఆవిర్భావం ఇప్పటివరకు రహస్యంగానే మిగిలింది.
అట్లాంటిక్ చరిత్రలో ఒక నాటకీయ ఘట్టం
తాజా పరిశోధన ప్రకారం, లక్షల ఏళ్ల క్రితం ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఒక చిన్న కానీ కీలకమైన టెక్టోనిక్ సంఘటన చోటుచేసుకుంది. ఒక దశలో ఆఫ్రికన్ మరియు యూరోపియన్ ప్లేట్ల మధ్య సరిహద్దు ఈ ప్రాంతం గుండా తాత్కాలికంగా ఏర్పడింది. సుమారు 37 నుంచి 24 మిలియన్ సంవత్సరాల క్రితం, ప్లేట్లు విడిపోయే ప్రక్రియలో సముద్రపు క్రస్ట్ సాగి, పగిలిపోయింది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు “జిప్‌ను నెమ్మదిగా తెరిచినట్లు” పోల్చారు. తూర్పు నుంచి పడమర దిశగా క్రస్ట్ విప్పుకుంటూ వెళ్లింది.
కింద నుంచి వచ్చిన వేడి కీలకం
ప్లేట్ సరిహద్దు ఏర్పడకముందే భూమి మాంటిల్ నుంచి వచ్చిన అధిక వేడి పదార్థం సముద్రపు క్రస్ట్‌ను దట్టంగా, వేడిగా మార్చింది. దీని వల్ల ఆ ప్రాంతం యాంత్రికంగా బలహీనపడింది. సహ రచయిత జార్గ్ గెల్డ్‌మాచర్ వివరిస్తూ, “వేడి కారణంగా క్రస్ట్ బలహీనపడింది. అందుకే ప్లేట్ సరిహద్దు ఇక్కడికి మారింది. ఆ సరిహద్దు తర్వాత అజోర్స్ వైపు కదిలినప్పుడు, కింగ్స్ ట్రో ఏర్పడటం ఆగిపోయింది” అని చెప్పారు.
భవిష్యత్ టెక్టోనిక్ మార్పులకు సంకేతం
కింగ్స్ ట్రో కథ కేవలం అట్లాంటిక్ గత చరిత్రకే కాదు, భూమి లోపలి మాంటిల్ ప్రక్రియలు ఉపరితల టెక్టోనిక్ కదలికలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా వివరిస్తోంది. పురాతన మాంటిల్ కార్యకలాపాలు భవిష్యత్‌లో భూమి ఎక్కడ విరిగే అవకాశం ఉందో సూచిస్తాయని ఈ అధ్యయనం చెబుతోంది. నేడు అజోర్స్ ప్రాంతంలో ఉన్న టెర్సెయిరా రిఫ్ట్ అనే కందక వ్యవస్థ ఇదే తరహా ప్రక్రియలతో క్రియాశీలంగా అభివృద్ధి చెందుతోంది. ఇది కింగ్స్ ట్రోను సృష్టించిన పరిస్థితులకు చాలా దగ్గరగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
లోతుల్లోకి వెళ్లిన శాస్త్రవేత్తలు
2020లో నిర్వహించిన పరిశోధనా యాత్రలో శాస్త్రవేత్తలు అధిక-రిజల్యూషన్ సోనార్‌తో సముద్రపు అడుగును మ్యాప్ చేశారు. కందకాల నుంచి అగ్నిపర్వత శిలలను సేకరించి రసాయన విశ్లేషణలు చేపట్టారు. ఈ డేటా ఆధారంగానే కింగ్స్ ట్రో రహస్యానికి తెరలేపగలిగారు.
భూమి ఇంకా ఎన్నో రహస్యాలు దాచుకుంది
ఈ పరిశోధన భూమి మీద కనిపించే అత్యంత నాటకీయమైన ప్రకృతి దృశ్యాలు.. మన కళ్లకు కనిపించని లోతుల్లో.. ఎలా పుట్టాయో అర్థం చేసుకోవడానికి కీలకంగా మారింది. గ్రాండ్ కాన్యన్‌కు సమానమైన అద్భుతం, మనకు తెలియకుండానే సముద్రపు అడుగున శతాబ్దాలుగా నిశ్శబ్దంగా ఉన్నదన్న విషయం నిజంగా ఆశ్చర్యకరం.


































