స్కోడా ఇండియా ఇటీవల కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో విడుదల చేసిన కైలాక్ (Kylaq) కారు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. తొమ్మిది నెలల క్రితం ఎంట్రీ లెవల్ SUVగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ మోడల్, తక్కువ సమయంలోనే వినియోగదారుల మనసులను దోచుకుంది.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, 2024 చివర్లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 30,000 యూనిట్లకు పైగా అమ్మకాల మైలురాయిని చేరుకుంది. 2025 జనవరి నుండి ఆగస్టు వరకు గణాంకాలను పరిశీలిస్తే, స్కోడా మొత్తం 46,000 యూనిట్ల కార్లను విక్రయించింది. అందులో కైలాక్ SUV ఒంటరిగా 65% వాటా సాధించడం విశేషం. అంటే, ఈ SUV మార్కెట్లో ఎంత పాపులర్ అయిందో ఈ సంఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి.
ముఖ్యంగా, 2025 మార్చి నెలలో కైలాక్ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి స్కోడా 5,364 కైలాక్ యూనిట్లను విక్రయించింది, ఇది కంపెనీకి ఒక పెద్ద మైలురాయి. అంతేకాక, స్కోడా మొదటి త్రైమాసికంలో విక్రయించిన 10,205 యూనిట్ల నుండి రెండో త్రైమాసికంలో 13,509 యూనిట్లకు చేరుకోవడం ద్వారా 32 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఇవి కైలాక్ SUVపై వినియోగదారుల నమ్మకం ఎంతగా పెరిగిందో చూపిస్తున్నాయి.
భారతదేశంలో కాంపాక్ట్ SUVలకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో స్కోడా ఇండియా నుంచి వచ్చిన కైలాక్ మోడల్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. జూలై-ఆగస్టు నెలల్లోనే ఈ కారు అమ్మకాలు 6,476 యూనిట్లకు చేరుకోవడం దీనికి ఉన్న పాపులారిటీని స్పష్టంగా చూపిస్తోంది. కైలాక్‌ను తొలిసారిగా మార్కెట్లోకి తీసుకువచ్చినప్పటి నుంచి ఇది కొనుగోలుదారులలో విశ్వాసాన్ని సంపాదించుకుంది. ఎంట్రీ-లెవల్ SUVగా ఉన్నప్పటికీ, దీని పనితీరు, డిజైన్, ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం స్కోడా కైలాక్ ఏడు వేరియంట్లలో లభిస్తోంది. ధర విషయానికొస్తే, ఇది రూ.7.55 లక్షల నుండి రూ.12.80 లక్షల ఎక్స్‌షోరూమ్ మధ్య అందుబాటులో ఉంది. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న కార్లపై GSTని 28% నుండి 18%కి తగ్గించడంతో కైలాక్ ధర మరింత సరసమైంది. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు ఇప్పుడు సుమారు రూ.1.19 లక్షల వరకు ఆదా చేయగలుగుతున్నారు.
పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ధర తగ్గింపు కైలాక్‌కు మరింత గిరాకీ తెచ్చిపెట్టనుంది. స్కోడా షోరూమ్‌లలో కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. కైలాక్ 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 115 bhp శక్తిని, 178 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు, ఈ SUV మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉండటం కస్టమర్లకు విభిన్న ఆప్షన్లు ఇస్తోంది.
నగర డ్రైవ్‌లో 19.05 కిమీ/లీ, హైవేపై 19.68 కిమీ/లీ ఫ్యూయల్ సామర్థ్యాన్ని అందిస్తుందని స్కోడా పేర్కొంది. అంటే, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో పాటు మంచి మైలేజ్ కూడా ఇవ్వడం దీనికి ప్రత్యేకతగా మారింది. డిజైన్ పరంగా కూడా కైలాక్ SUV స్టైలిష్‌గా ఉండి యువతను, ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఎక్స్‌టీరియర్‌లో స్పోర్టీ లుక్, ఇంటీరియర్‌లో సౌకర్యవంతమైన సీటింగ్, ఆధునిక ఫీచర్లు ఉండటం వల్ల ఇది ప్రాక్టికల్ ఆప్షన్‌గా మారింది.
స్కోడా కైలాక్ భద్రతా పరంగా కూడా తన ప్రత్యేకతను చాటుతోంది. ఈ కారు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. అదనంగా, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ను అందుకోవడం ద్వారా కైలాక్ భద్రతా ప్రమాణాలు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో నిరూపించుకుంది. పెద్దల రక్షణ విభాగంలో కైలాక్ 32 పాయింట్లలో 30.88 పాయింట్లు సాధించగా, పిల్లల రక్షణలో 49 పాయింట్లలో 45 పాయింట్లను సంపాదించింది.






























