కిడ్నీ ఇస్తే 30లక్షలు ఇస్తామని మోసం చేశారు.. గుంటూరులో వెలుగులోకి కిడ్నీ రాకెట్
Kidney Racket : గుంటూరులో కిడ్నీ రాకెట్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మోసం చేసి కిడ్నీ తీసుకున్నారని గుంటూరుకు చెందిన మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే 30లక్షలు ఇస్తామని విజయవాడకు చెందిన బాషా తెలిపాడని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కిడ్నీ ఇవ్వడానికి వెళ్లానని వెల్లడించారు. విజయవాడలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారని, డబ్బు ఇవ్వకుండా డాక్టర్ శరత్ బాబు, మధ్యవర్తి బాషా, కిడ్నీ గ్రహీతలు తనను మోసం చేశారని బాధితుడు ఆరోపించారు. ఎంతోమందికి డబ్బు ఆశ చూసి కిడ్నీలు తీసుకున్నారని బాధితుడు వాపోయారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు బాధితుడు మధుబాబు.
అలా.. నన్ను మోసం చేశారు- మధుబాబు, బాధితుడు
నేను ఆటో డ్రైవర్ ని. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత డబ్బు ఇస్తారని నాతో చెప్పాడు. ఫేస్ బుక్ లో ఆ సమాచారం ఉందని చెప్పాడు. నేను ఫేస్ బుక్ లో సెర్చ్ చేశాను. అక్కడ ఒక వెబ్ సైట్ చూశాను. దాన్ని ఓపెన్ చేసి చూస్తే కిడ్నీ కావాలని ఉంది. ఓ పాజిటివ్ వాళ్లు, 31 ఏళ్ల వయసు ఉన్న వారు డొనేట్ చేయొచ్చని ఉంది. నాది ఓ పాజిటివ్, పైగా వయసు కూడా 31. దాంతో నేను కిడ్నీ డొనేట్ చేస్తానని రిప్లయ్ ఇచ్చాను. విజయవాడ నుంచి బాషా అనే వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అతడు ఇదివరకే తన కిడ్నీని డొనేట్ చేశాడట. నేను కిడ్నీ ఇచ్చాను, నాకు 30లక్షలు ఇచ్చారు అని చెప్పాడు.
మీరు మేసేజ్ చేశారు కదా, మీరు కూడా కిడ్నీ ఇస్తారా అని అడిగాడు. నేను ఇస్తానని చెప్పా. నన్ను విజయవాడ రమ్మని అతడు చెప్పాడు. విజయవాడ వెళ్లాక వెంకట్ అనే మీడియేటర్ ను పరిచయం చేశాడు. ఆయన ద్వారా పేషెంట్ వాళ్ల బావమరిది, పేషెంట్ కు పరిచయం చేశాడు. అన్ని టెస్టులు చేయించారు. కిడ్నీ డొనేట్ చేయాలి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా అయ్యి ఉండాలి. లేదంటే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా అయ్యి ఉండాలన్నారు. నేను ఏమీ కాదు కాబట్టి.. నా అడ్రస్ లు మొత్తం మార్చేశారు. వాళ్ల స్వగ్రామం కిందకు అడ్రస్ మార్చారు.
వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్లకు అనుకూలంగా అన్ని ఆధారాలు, వీడియోలు సృష్టించారు. నేను వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ నని, వాళ్ల ఊరిలోనే ఉంటున్నా అని ఆధారాలు సృష్టించారు. గత నెల 15వ తేదీన కిడ్నీ తీసుకున్నారు. కానీ డబ్బు మాత్రం ఇవ్వలేదు. పైగా.. నిన్ను ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి కిడ్నీ తీసుకున్నట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నువ్వు ఏమీ చేయలేవు అన్నట్లుగా వారు మాట్లాడుతున్నారు. నాకు టెస్టులు అన్నీ చేసి లెఫ్ట్ కిడ్నీ తీసుకుంటామని ముందు చెప్పారు. కానీ, లెఫ్ట్ కాకుండా రైట్ కిడ్నీ తీసుకున్నారు” అని బాధితుడు వాపోయారు.