ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్ధలు ధ్వంసమయ్యాయంటూ ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీలు.. వచ్చీ రాగానే ప్రక్షాళన బాట పట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధతో పాటు పలు శాఖల్లో ప్రక్షాళన చేపట్టారు.
ఇదే క్రమంలో ఇప్పుడు కీలకమైన రెవెన్యూశాఖలో ప్రక్షాళన చేపట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. త్వరలో దీనిపై మార్గదర్శకాలు వెలువడే అవకాశముంది.
రాష్ట్రంలో ఎంతో కీలకమైన రెవెన్యూశాఖపై దశాబ్దాలుగా అవినీతి ముద్ర కూడా అదే స్దాయిలో ఉంటోంది. ప్రభుత్వాలు మారుతున్నా వ్యవస్ధాగత లోపాల కారణంగా అక్రమార్కులు తప్పించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టాలని, తద్వారా లోపాల్ని సరిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అంతర్గత చర్చల్లో ఓ క్లారిటీకి కూడా వచ్చినట్లు సమాచారం.
తాజా అంచనాల ప్రకారం రెవెన్యూశాఖలో ఇకపై కీలక బాధ్యతలు తహసీల్డార్లకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి వెబ్ ల్యాండ్ లో రైతుల ఆధార్ నంబర్ల సవరణ, భూకేటాయింపు, భూసేకరణ, కోర్టు ఉత్తర్వు అమలు వంటి కీలక బాథ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అలాగే ఆర్డీవోలకు మ్యుటేషన్ల సవరణ, ఎల్పీఎం నంబర్లలో సమస్యలు చక్కదిద్దే బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. ప్రభుత్వ భూముల్ని పట్టా భూములుగా మార్చే అధికారం మాత్రం జాయింట్ కలెక్టర్ల వద్దే ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో భూవివాదాల పరిష్కారం కోసం చేపట్టిన సమగ్ర సర్వే ద్వారా కూడా పలు చోట్ల ఫలితాలు రావడం లేదని భావిస్తున్న ప్రభుత్వం.. ఈసారి ప్రక్షాళనలో పలు సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. వీటి ద్వారా క్షేత్రస్దాయిలో సమస్యలు పరిష్కరించి సివిల్ వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిపై రెండు రోజుల్లో పూర్తిస్దాయి మార్గదర్శకాలు వెలువడతాయని తెలుస్తోంది.
































