ఆగస్టు 19 ఒక ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ఆగస్టు 19 సోమవారం రాఖీపౌర్ణమి మాత్రమే కాదు.. మరో ప్రత్యేకత కూడా ఉంది. రక్షాబంధన్ రోజున ఒక ఖగోళ సంఘటన జరగబోతోంది.
పౌర్ణమి వేళ వినీలాకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. ఆగస్ట్ 19న పౌర్ణమి రాత్రి సూపర్ బ్లూ మూన్ కనిపించనుంది. ఈ సూపర్‌మూన్ 2024లో అతిపెద్ద, ప్రకాశవంతమైన చంద్రుడు ప్రజల్ని కనువిందు చేయనున్నాడు. ఇకపోతే, 2024లో వరుసగా మూడు సూపర్ మూన్‌లు ఆవిష్కరం కాబోతున్నాయి. ఇందులో రాఖీపౌర్ణమి పండుగ రోజున ఒకటి దర్శనం ఇవ్వనుండగా.. మరో సూపర్ మూన్ సెప్టెంబర్ 17న కనిపించనుందని, దీనినే హార్వెస్ట్ మూన్ అంటారు. ఇది హంటర్ మూన్ అని పిలువబడే అక్టోబర్ 17న కనిపిస్తుంది. నవంబర్ 15న సంవత్సరంలో చివరిది అవుతుందని, దీనిని బీవర్ మూన్ అంటారని పరిశోధకులు చెబుతున్నారు..
పౌర్ణమి రోజు 25శాతం సూపర్ మూన్‌లు ఏర్పడితే 3శాతం మాత్రమే బ్లూ మూన్స్ ఆవిష్కృతమవుతాయి. ఇక ఈ రెండింటి కలయికలో ఇంకా అరుదుగా వస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మళ్లీ సూపర్ మూన్, బ్లూ మూన్ రెండింటి కలయికలో 2037 సంవత్సరంలో దర్శనం ఇచ్చే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. రక్షా బంధన్‌ను రాఖీ పూర్ణిమ అంటారు. పౌర్ణమి రోజునే ఈ పండుగను జరుపుకుంటారు. సూపర్ బ్లూ మూన్‌తో ఈసారి రాఖీ పండగ వస్తోంది. ఈ కారణంగా ప్రతి భారతీయుడికి ఇది చాలా ప్రత్యేకంగా మారింది.
1979లో రిచర్డ్ నోల్లెచే సూపర్ మూన్ అనే పేరును పరిచయం చేశారు. దాని పేరుకు తగ్గట్టుగానే సూపర్ బ్లూ మూన్ రోజున చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. అయితే, నాసా పరిశోధకుల ప్రకారం అప్పుడప్పడు పొగ, ధూళి తదితర చిన్న చిన్న కణాలు కాంతి ఎరుపు తరంగ ధైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దాంతో చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమితో పోలిస్తే సూపర్‌మూన్ 30 శాతం వరకు ప్రకాశవంతంగా, 14 శాతం పెద్దదిగా ఉంటుంది. ఈ సూపర్ బ్లూ మూన్ సమయంలో చంద్రునిపై 98 శాతం సూర్యకాంతి ఉంటుంది. ఇది నిరంతరంగా 99 నుంచి 100 శాతానికి పెరుగుతుంది. ఇది భూమికి దాదాపు 225,288 మైళ్ల దూరంలో ఉంటుంది.