73 ఏళ్లుగా మద్యం అమ్మని ఓ ముస్లిం దేశం ఇప్పుడు అటు వైపుగా అడుగులు వేస్తుంది. ఇంతకీ ఆ దేశం పేరు ఏంటో తెలుసా.. సౌదీ అరేబియా. ఈ దేశం ఇప్పుడు ఆధునీకరణ మార్గంలో పయనిస్తోంది.
దాని దీర్ఘకాల కఠినమైన నియమాలలో ఒకదాన్ని తాజాగా సడలిస్తూ, సౌదీ అరేబియా త్వరలో రెండు కొత్త మద్యం దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రెండింటిలో ఒకటి అరాంకోలోని విదేశీ, ముస్లింయేతర ఉద్యోగుల కోసం, మరొకటి జెడ్డాలో విదేశీ దౌత్యవేత్తల కోసం అని సమాచారం.
పలు నివేదికల ప్రకారం.. సౌదీ అరేబియాలోని ధహ్రాన్‌లో కొత్త స్టోర్ ఒక ప్రైవేట్ అరాంకో కాంపౌండ్‌లో ఉంటుంది. ఈ స్టోర్ అక్కడి ముస్లింయేతర విదేశీ కార్మికుల కోసం తెరిచి ఉంటుంది. అలాగే విదేశీ దౌత్యవేత్తల కోసం జెడ్డాలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ నివేదికలు తెలిపాయి. ఈ రెండూ 2026 నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే అధికారిక తేదీ ఇంకా రాలేదు. ప్రభుత్వం లేదా అరామ్‌కో నుంచి ఎటువంటి ప్రకటన అధికారికంగా వెలువడలేదు.
73 సంవత్సరాల తర్వాత రియాద్‌లో..
ఇస్లాం జన్మస్థలంగా పరిగణించే సౌదీ అరేబియా ఇస్లాంలో పవిత్ర హోదాను కలిగి ఉంది. 73 ఏళ్లలో మొదటిసారిగా సౌదీ అరేబియా రియాద్‌లో ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం ఒక మద్యం దుకాణాన్ని ప్రారంభించింది. ఈ భవనాన్ని బూజ్ బంకర్ అని పిలుస్తారు. ప్రీమియం రెసిడెన్సీ ఉన్న ముస్లిమేతర విదేశీయులను ఇప్పుడు ఈ రియాద్ దుకాణంలో మద్యం కొనుగోలు చేయడానికి అనుమతించారు. గతంలో వీరికి మద్యం కావాలంటే దౌత్య మెయిల్, బ్లాక్ మార్కెట్ లేదా ఇంట్లో తయారు చేసిన మద్యం మాత్రమే అందుబాటులో ఉండేది.
క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నాయకత్వంలో సౌదీ అరేబియా గత కొన్నేళ్లుగా మహిళలు డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం, పురుషులు, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో కలిసి కూర్చోవడానికి నిబంధనలను సడలించడం, సినిమా థియేటర్లు, కచేరీలను తిరిగి తెరవడానికి అనుమతించడం, ఎడారి రేవ్‌లు, నైట్ లైఫ్ ఈవెంట్‌లు, మతపరమైన పోలీసుల అధికారాలను తగ్గించడం వంటి అనేక సామాజిక సంస్కరణలను దేశంలో అమలు చేసింది. ఈ సంస్కరణలు దేశంలో పర్యాటకాన్ని పెంచడం, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, చమురుపై ఆర్థిక వ్యవస్థ ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. సౌదీ అరేబియా 2034 ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇటీవల సౌదీ అరేబియా రెడ్ సీ గ్లోబల్ ప్రాజెక్ట్ కింద అనేక లగ్జరీ హోటళ్లను అభివృద్ధి చేసింది. కానీ ఈ రిసార్ట్‌లన్ని కూడా మద్యం రహితంగా ఉన్నాయి. పర్యాటక ప్రాంతాలలో మద్యం అమ్మకాలను ప్రభుత్వం త్వరలో అనుమతించవచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. అయితే సౌదీ అధికారులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం మధ్యస్థ మార్గాన్ని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు.

































