చిన్న పిల్లలకు తల్లిదండ్రులు చిప్స్ ప్యాకెట్లు కొనిపెట్టడం సహజం. కొనాలని పిల్లలు మారాం చేస్తుంటారు. కానీ ఒక్కోసారి అవి కూడా ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన హెచ్చరించింది.
ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన మినియేచర్ బొమ్మను మింగడంతో నాలుగేళ్ల బాలుడు మరణించాడని పోలీసులు బుధవారం తెలిపారు. ఈ సంఘటన దరింగ్ బాడి బ్లాక్‌లోని బ్రహ్మణి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసుమహపాడ గ్రామంలో చోటుచేసుకుంది. మరణించిన బాలుడిని రంజిత్ ప్రధాన్ కుమారుడు బిగిల్ ప్రధాన్‌గా గుర్తించారు.
బాలుడి తండ్రి తన కొడుకు కోసం చిప్స్ ప్యాకెట్ తీసుకువచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్యాకెట్‌లో చిన్న ప్లాస్టిక్ బొమ్మ తుపాకీ వచ్చింది. బాలుడు చిప్స్ తింటుండగా, తల్లిదండ్రులు తమ పనుల్లో నిగ్నమై ఉన్నారు. అయితే, అనుకోకుండా చిప్స్ అని భావించిన పిల్లాడు బొమ్మను తినేందుకు ప్రయత్నించాడు. బాలుడి గొంతులో బొమ్మ అడ్డుపడటంతో ఏడ్చడం ప్రారంభించాడు. తల్లిదండ్రులు బొమ్మను తీసేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. బాలుడిని 30 కి.మీ దూరంలో ఉన్న దరింగ్ బాడీ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చిప్స్ ప్యాకెట్‌లోని బొమ్మ బాలుడి వాయునాళాన్ని అడ్డుకుందని వైద్యులు చెప్పారు.
































