ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్‌ బాంబుతో దాడి ఘటన

ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై పెట్రోల్‌ బాంబుతో దాడి ఘటన ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి జరిగింది.


బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వెలిగండ్ల మండలం, పందువ పంచాయతీ పరిధి జంగం నరసాయపల్లి గ్రామంలో తీట్ల నారాయణ అనే ఉపాధ్యాయుడు తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నారు.
రోజులాగే ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా అర్ధరాత్రి 2.15 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులు బీరు బాటిల్‌లో పెట్రోల్‌ పోసుకొని వాటికి గుడ్డ చుట్టి నిప్పుపెట్టి ఉపాధ్యాయుని ఇంటిలోపలికి విసిరారు. ఆ బాటిల్‌ పూల చెట్టుకు తగిలి ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో మంటలు వ్యాపించాయి. ఉలిక్కిపడి లేచిన ఉపాధ్యాయుడు బయటకు వచ్చి చూడగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పరిగెత్తుకుంటూ వెళ్తూ కనిపించారని తెలిపారు. 1995 నుంచి ఐదేళ్లపాటు పందువ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు. 2002లో ఆయనకు టీచర్‌ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుమ్మళ్లకర్ర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయంగానే ఈ దాడి జరిగిందేమోనని గ్రామస్తులు భావిస్తున్నారు.కనిగిరి డిఎస్‌పి రామరాజు, పామూరు సిఐ రామానాయక్‌, వెలిగండ్ల ఎస్‌ఐ శివ, ఒంగోలు క్లూస్‌ టీం ఎస్‌ఐ రంజిత్‌ కుమార్‌ సంఘటనాస్థలానికి చేరుకొని బాటిళ్లపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు డిఎస్‌పి రామరాజు తెలిపారు