మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం ఇచ్చే పథకం కోసం చూస్తున్నారా..? అయితే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ మీకు బెస్ట్ ఆప్షన్ కావచ్చు. దీనిని కేవలం రూ.1,000తో ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్ పథకాలు రిస్క్ లేకుండా అద్భుతంగా ఉండడంతో మధ్య చాలా మంది వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పథకం అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
వడ్డీ రేట్లు: ఈ పథకం 6.9శాతం నుండి 7.5శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. పెట్టుబడి కాలం పెరిగేకొద్దీ వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. ఐదేళ్ల పెట్టుబడికి అత్యధిక వడ్డీ రేటు లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ప్రభుత్వ సంస్థ కాబట్టి, మీ డబ్బుకి పూర్తి భద్రత ఉంటుంది. డబ్బు కోల్పోయే ప్రమాదం ఉండదు.
ఇతర ప్రయోజనాలు
జాయింట్ అకౌంట్: ఈ పథకం కింద వ్యక్తిగతంగా లేదా కుటుంబ సభ్యులతో కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. పదేళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల పేరు మీద కూడా ఖాతా తెరవడానికి అవకాశం ఉంది. ఐదేళ్లపాటు పెట్టుబడి పెడితే, మీరు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.
విత్ డ్రా రూల్స్..
ఈ పథకంలో డబ్బును మధ్యలో తీయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
6 నెలల లోపు: మీరు డబ్బును తీయలేరు.
6 నెలల నుండి ఏడాది లోపు: మీరు పొదుపు ఖాతాకు సమానమైన వడ్డీ రేటు మాత్రమే పొందుతారు.
1 సంవత్సరం తర్వాత: మీకు నిర్ణీత వడ్డీ రేటు కంటే 2శాతం తక్కువ వడ్డీ లభిస్తుంది.
ఎంత రాబడి పొందవచ్చు..?
ఉదాహరణకు.. మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఐదేళ్లపాటు రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే.. మీకు మొత్తం రూ.29,776 వడ్డీ వస్తుంది. అంటే ఐదేళ్ల తర్వాత మీ చేతికి రూ.2,29,776 వస్తుంది. రిస్క్ లేకుండా గణనీయమైన మొత్తాన్ని పెంచుకోవాలనుకునేవారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పథకం గురించి మరింత సమాచారం కావాలంటే, మీరు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌ను సంప్రదించవచ్చు.






























