పాకిస్తాన్‌లో ఒక్క టమాటా ఖరీదు రూ.75.. సాయం చేయాలంటూ భారత్‌కు విన్నపం.. పార్లమెంటులో రచ్చరచ్చ

పాకిస్తాన్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.


ప్రస్తుతం టమాటా ధర కిలోకు రూ.600 చేరింది. అంటే 400 శాతం కంటే ఎక్కువ పెరుగుదల. ఈ పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది.

ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో టమాటా రుణం (Tomato Loan) అనే పదం పెద్ద చర్చకు దారితీసింది. ఒక ఎంపీ తన ప్రసంగంలో చేతిలో టమాటాను పట్టుకుని.. ఈ టమాటాను నేను చాలా కష్టపడి తెచ్చుకున్నాను. దీని ధర రూ.75 అని చెప్పడం వీడియో రూపంలో వైరల్ అయింది. ఆ వ్యాఖ్య వ్యంగ్యంగా చేసినప్పటికీ అది దేశ ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించింది. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం ధరలను నియంత్రించడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు గుప్పించాయి.

అక్టోబర్ 11 నుండి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణల కారణంగా వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. టోర్ఖం, స్పిన్ బోల్డాక్ ప్రాంతాల్లోని సరిహద్దు పాయింట్లు మూసివేయడంతో కూరగాయల దిగుమతులు ఆగిపోయాయి. రాయిటర్స్ ప్రకారం.. ఈ మూసివేత వల్ల రెండు దేశాలు రోజుకు సుమారు 1 మిలియన్ అమెరికన్ డాలర్లు నష్టపోతున్నాయి. సుమారు 5 వేల కంటైనర్లు సరిహద్దు వద్ద ఇరుక్కుపోయాయి. వాటిలో చాలా వాటి కూరగాయలు చెడిపోయాయి.

పాకిస్తాన్-ఆఫ్ఘన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఖాన్ జాన్ అలోకోజాయ్ మాట్లాడుతూ.. ప్రతిరోజూ 500 కంటైనర్లు ఎగుమతికి సిద్ధం ఉండేవి, కానీ ఇప్పుడు అవి వృథా అయ్యాయని పేర్కొన్నారు. ఫలితంగా, మార్కెట్‌లో టమాటాలు, ఆపిల్లు, ద్రాక్ష వంటి పండ్ల కొరత ఏర్పడిందన్నారు.

టమాటాతో పాటు, వెల్లుల్లి కిలో రూ.400, అల్లం రూ.750, ఉల్లిపాయలు రూ.120, బఠానీలు రూ.500, బెండకాయలు, క్యాప్సికమ్ రూ.300, క్యారెట్లు రూ.200, నిమ్మకాయలు రూ.300, కొత్తిమీర చిన్న కట్ట రూ.50కి అమ్ముడవుతోంది. ఒకప్పుడు తక్కువ ధరలో దొరికే వస్తువులు ఇప్పుడు సాధారణ కుటుంబాలకు అందని విలాసంగా మారాయి.

పార్లమెంట్ చర్చల్లో కొంతమంది సభ్యులు భారతదేశం నుండి దిగుమతులు జరిగిన కాలాన్ని గుర్తుచేసుకున్నారు. భారతదేశం నుండి వస్తువులు దిగుమతి అయ్యే రోజులు ఎంత సులభంగా ఉండేవో ఇప్పుడు తెలుస్తోంది అంటూ ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో ప్రజలు కూడా టమాటాలు భారతదేశం నుండి వచ్చేవి, ఇప్పుడు అవి ఎక్కడికి పోయాయి? అంటూ నినాదాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కరెన్సీ పతనం, ఇంధన కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో కుదేలై ఉంది. ఇప్పుడు సరిహద్దు మూసివేత కారణంగా ఆహార కొరత మరింత తీవ్రమవుతోంది. ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.