క్లాస్‌రూమ్‌లో కూర్చొన్న చోటే కుప్పకూలిన విద్యార్థి.. కళ్ల ముందే ఆగిన గుండె.

విల్లుపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న 11వ తరగతి విద్యార్థి తరగతి గదిలో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ప్రత్యేక తరగతి కోసం ఉదయం 7 గంటలకు పాఠశాలకు వచ్చిన విద్యార్థి స్పృహ కోల్పోయాడు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గుండె ఎందుకో సడెన్‌గా కొట్టుకోవడం మానేస్తోంది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ.. డాన్సులేస్తూ.. నవ్వుతూ పలకరించిన చెట్టంత మనిషి చూస్తుండగానే కుప్పకూలిపోతున్నాడు. పట్టుమని పాతికేళ్లకే గుండె గబుక్కున ఆగిపోతోంది. ఏదో ఒక కేసయితే ఏదో అనుకోవచ్చు, ఈమధ్యకాలంలో తరచూ ఇలాంటి కేసులే నమోదుకావడం ఆందోళనపరుస్తోంది. తాజాగా మరో ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది.


విల్లుపురం జిల్లాలో 11వ తరగతి విద్యార్థి క్లాసు రూమ్‌లో స్పృహ కోల్పోయి మరణించిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉదయం ప్రత్యేక తరగతికి వచ్చిన విద్యార్థి అకస్మాత్తుగా తరగతి గదిలోనే స్పృహ కోల్పోయి మరణించాడు. విల్లుపురం జిల్లా విరాట్టికుప్పం ప్రాంతానికి చెందిన మహేశ్వరి కుమారుడు మోహన్‌రాజ్ (17) ఒక ప్రైవేట్ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. మోహన్‌కు ప్రతిరోజు ఉదయం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు పాఠశాలకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే ఆగస్టు 12, 2025న విద్యార్థి మోహన్‌రాజ్ యథావిధిగా పాఠశాలకు వెళ్లాడు. ఆ సమయంలో తరగతి గదిలో కుర్చీలో కూర్చొన్న తర్వాత మోహన్‌రాజ్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు.

తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే మోహన్‌రాజ్‌ను రక్షించేందుకు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోహన్‌రాజ్‌ను పరీక్షించిన వైద్యులు విద్యార్థికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, ఆక్సిజన్ తక్కువగా ఉన్నందున వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో విద్యార్థిని వెంటనే అక్కడి నుండి ఆసుపత్రికి తరలించారు. అక్కడ విద్యార్థిని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మరణించాడని చెప్పారు.

ఈ సంఘటనపై విల్లుపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల తరగతి గదిలోని సిసిటివి కెమెరా ఫుటేజ్ బయటకు వచ్చింది. ఇందులో విద్యార్థి స్పృహ కోల్పోతున్నట్లు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. వీడియోలో మోహన్‌రాజ్ తరగతి గదిలోకి ప్రవేశించి డెస్క్ వద్ద కూర్చుని ఉన్నట్లు కనిపిస్తుంది. తరగతి గదిలో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా అతను స్పృహ కోల్పోయాడు. ఇది చూసిన వెంటనే ఉపాధ్యాయులు, విద్యార్థులు స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి దర్యాప్తు తర్వాతే విద్యార్థి మరణానికి గల కారణాలు తెలుస్తాయన్నారు పోలీసులు. ఈలోగా, విద్యార్థి ఊపిరాడక గుండెపోటుతో మరణించి ఉండవచ్చని చెబుతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.