దక్షిణ కొరియా, ప్రపంచంలోని అత్యంత ఆధునిక, టెక్నాలజీ ఆధారిత దేశాల్లో ఒకటి. క్రైస్తవ దేశమైన దక్షిణ కొరియా.. టెక్నాలజీ పెరుగుతుండడంతో మతాచారాల నుంచి దూరంగా అడుగులేస్తూ లౌకిక సమాజంగా రూపాంతరం చెందుతోంది.
ఈ పరిణామం ఒక్క రాత్రిలో జరిగినది కాదు. దశాబ్దాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పుల ఫలితం.
60 శాతం మంది మతానికి దూరం..
దక్షిణ కొరియా గత ఐదు దశాబ్దాలలో యుద్ధ-విధ్వంస ఆర్థిక వ్యవస్థ నుంచి హైటెక్ ఆర్థిక శక్తిగా ఎదిగింది. వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, డిజిటల్ జీవనశైలి సమాజంలో శాస్త్రీయ, తార్కిక ఆలోచనను పెంపొందించాయి. యువత విద్య, కెరీర్, ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారిస్తూ మతాచారాలను వెనక్కి నెట్టారు. 2024 డేటా ప్రకారం, దక్షిణ కొరియాలో సుమారు 60 శాతం మంది ఎటువంటి మతాచారాలను పాటించడం లేదు. మిగిలిన వారిలో 31 శాతం మంది క్రై స్తవం (20% ప్రొటెస్టంట్లు, 11% కాథలిక్కులు), 17 శాతం మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు. ఈ గణాంకాలు దక్షిణ కొరియా సమాజంలో మతం పట్ల ఆసక్తి గణనీయంగా తగ్గుతున్నట్లు సూచిస్తున్నాయి.
మతం ముసుగులో కుంభకోణాలు..
దక్షిణ కొరియాలో మత సంస్థలపై విశ్వాసం క్షీణించడానికి కొన్ని కీలక సంఘటనలు కారణం. 2020లో షిన్చియోంజి చర్చ్ ఆఫ్ జీసస్ కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంది. ఈ సంస్థ వైరస్ సమాచారాన్ని దాచిపెట్టిందనే ఆగ్రహం ప్రజల్లో మత సంస్థలపై అనుుమానాలను మరింత పెంచింది. అదే విధంగా, ప్రొటెస్టంట్ మెగా చర్చీలలో పన్ను ఎగవేతలు, ఆర్థిక కుంభకోణాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు మత సంస్థల విశ్వసనీయతను దెబ్బతీశాయి. దీంతో దక్షిణ కొరియన్లు ఆధ్యాత్మికతను మతాచారాల నుంచి వేరు చేసి చూడటం ప్రారంభించారు. బౌద్ధ ఆలయాలు టూరిజం స్పాట్‌లుగా మారడం, వాణిజ్యీకరణ కారణంగా వాటి ఆధ్యాత్మిక విలువలు క్షీణించడం కూడా ప్రజలను మతం నుంచి దూరం చేసింది.
మత రాజకీయాలు..
1980, 1990లలో క్రై స్తవ నాయకులైన కిమ్ యంగ్ సామ్, కిమ్ డే జంగ్ వంటి వారి రాజకీయ ప్రాధాన్యత మత సంస్థలను రాజకీయ పార్టీలతో ముడిపెట్టింది. చర్చీలు రాజకీయ ప్రచారాలకు నిధులు సమకూర్చడం, ఓటు బ్యాంకుల కోసం లాబీయింగ్ చేయడం వంటివి ప్రజల్లో మత సంస్థలపై అసంతృప్తిని పెంచాయి. దక్షిణ కొరియా ప్రజాస్వామ్యం మతం, రాజకీయాల మధ్య స్పష్టమైన విభజన రేఖను గుర్తించగలిగింది. ఈ లౌకిక విధానం ఆసియాలోని ఇతర దేశాలైన జపాన్, ఉత్తర కొరియాలతో పోలిస్తే దక్షిణ కొరియాను ప్రత్యేకంగా నిలిపింది. జపాన్‌లో మతాచారాలు ఇంకా గణనీయంగా కనిపిస్తుండగా, ఉత్తర కొరియా నిరంకుశ నాస్తికత్వాన్ని అమలు చేస్తోంది. దక్షిణ కొరియా మాత్రం మత స్వేచ్ఛను నిషేధించకుండా, దాన్ని వ్యక్తిగత ఎంపికగా వదిలేసింది.
































