దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆస్తమాతో అవస్థలు పడుతున్నారా? పైసా ఖర్చులేని ఒక చక్కటి పరిష్కారం ఉందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.
అదే గోల్డెన్ మిల్క్. ఉదయం సాయంత్రం జస్ట్ వన్ గ్లాస్ తాగితే చాలు బిగ్ రిలీఫ్ పొందుతారు. ఇంతకీ గోల్డెన్ మిల్క్ అంటే ఏమిటి? అనే సందేహమా? మరేదో కాదు.. గోరు వెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకుంటే చాలు అదే గోల్డెన్ మిల్క్(Turmeric Milk or Haldi Doodh). ఇదొక పురాతన భారతీయ ఆరోగ్య ఔషధం కూడా. ఆధుని విజ్ఞాన శాస్త్రం కూడా దీని ప్రయోజనాలను ధృవీకరిస్తోంది. దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం.
గోల్డెన్ మిల్క్ ఆరోగ్య ప్రయోజనాలు
*పసుపు కలిపిన గోరు వెచ్చని పాలు శరీరానికి బలాన్ని, తగ్గు జలుబు, గొంతు నొప్పి, ఆస్తమా నుంచి రిలీఫ్ అందిస్తాయి. ముఖ్యంగా పసుపులోని (Turmeric) కర్కుమిన్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం వల్ల ఇలాంటి బెనిఫిట్స్ అందుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా ఈ పసుపు పాల పానీయం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది.
*గోల్డెన్ మిల్క్ లేదా పసుపు పాలు శరీరంలో వాపును, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సంక్రమణలను తగ్గిస్తుందని ప్రముఖ హెల్త్ జర్నల్ PubMedలో పబ్లిషైన అధ్యయన వివరాలు పేర్కొన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో ఇది ముందస్తు ఔషధంలా పనిచేస్తుంది.
*పసుపులోని కర్కుమిన్ శ్వాసకోశ సంబంధిత సంక్రమణలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు నివారణతోపాటు శ్లేష్మం (mucus) నిర్మాణాన్ని తగ్గిస్తుంది. శీతాకాలంలో ఎదురయ్యే అనారోగ్యాలకు ఇది చక్కటి ఔషధం. కర్కుమిన్‌లోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
*ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పసుపు కలిపిన గోరు వెచ్చని పాలను తాగడంవల్ల రిలీఫ్ పొందుతారు. ఎందుకంటే కర్కుమిన్ లోని యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శ్వాసనాళాలలో వాపును తగ్గిస్తాయి. శ్వాస తీసుకోవడాన్ని సులభతరం చేస్తాయి. అంతేకాకుండా గోల్డెన్ మిల్క్‌లోని కర్కుమిన్, పాలలోని పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శీతాకాలంలో సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి.
*పసుపు కలిపిన వెచ్చని పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తిని పెంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. అలసటను తగ్గించి, నిద్రను మెరుగుపరుస్తుంది. రాత్రిపూట ఒక కప్పు గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. అయితే గర్భిణులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ఉపయోగించాలి.
*తయారీ విధానం: ఒక కప్పు వెచ్చని పాలలో 1/4 టీస్పూన్ పసుపు (లేదా తాజా పసుపు తురుము) కలపాలి. అందులో ఒక చిటికెడు నల్ల మిరియాలు (కర్కుమిన్ శోషణ కోసం) చేర్చాలి. రుచి కోసం తేనె/బెల్లం/చక్కెర జోడించవచ్చు. (అల్లం లేదా దాల్చిన చెక్క కూడా చేర్చుకోవచ్చు) ఆ తర్వాత బాగా కలిపి, రాత్రి తాగేస్తే సరి.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
































