Aarambham Movie Review: ఆరంభం మూవీ రివ్యూ

ఈ మధ్యకాలంలో రొటీన్ కమర్షియల్ డ్రామా సినిమాలతో పాటు విభిన్నమైన సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు కూడా భిన్నంగా ఉండే సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆరంభం అనే ఒక సైఫై థ్రిల్లర్ ని ఈ శుక్రవారం నాడు ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్ ప్రధాన పాత్రలో సుప్రీతా సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాని ఏవిటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద అభిషేక్ వీటి నిర్మించారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు అజయ్ నాగ్ పరిచయమయ్యారు. ట్రైలర్, సాంగ్స్ తో ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం.


ఆరంభం కథ విషయానికొస్తే
కాలాఘాటి జైల్లో ఒక మర్డర్ కేసు నిమిత్తం రెండున్నర ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తూ ఉంటాడు మిగిల్(మోహన్ భగత్). ఉదయాన్నే ఉరితీయాలి అని అన్నీ సిద్ధం చేసుకుంటున్న సమయంలో జైలు నుంచి ఎస్కేప్ అవుతాడు. అతనిని బంధించిన సెల్ చెక్కుచెదరలేదు, తాళాలు కూడా వేసిన వేసినట్టే ఉన్నాయి. అయినా అతను ఎలా తప్పించుకున్నాడో తెలియక జైలు సిబ్బంది తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. తమ వల్ల కాదని భావించి అసలు ఏం జరిగిందో కనిపెట్టాలని భావించి ఒక డిటెక్టివ్(రవీంద్ర విజయ్)ని పిలిపిస్తారు. అయితే మిగిల్ రాసుకున్న పుస్తకం అతని సెల్ లో దొరుకుతుంది. ఆ పుస్తకంలో అతను చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి( భూషణ్) దగ్గర పెరిగాడని, అతను ఒక డేజావు ఎక్స్పరిమెంట్ చేస్తున్నాడని ఉండడమే, కాక అతని జీవితానికి సంబంధించిన కొన్ని వివరాలు కూడా ఉంటాయి. అయితే అసలు ఆ వ్యక్తి ఎవరు? అతని కథ ఏమిటి? ఈ ప్రయోగం ఏమిటి మిగిల్ ఎవరిని మర్డర్ చేసి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు? రేపు ఉరి వేస్తారనగా ఎలా తప్పించుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ ఈ ఆరంభం అనే సినిమా ఒక కన్నడ పాపులర్ నవలలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. లైన్ గా చూసుకుంటే సింపుల్ కథని ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసేలా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యేలాగానే ఏడు అధ్యాయాలుగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమా మొదలైనప్పటి నుంచి సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కొన్ని ఎమోషన్స్ మాత్రం వర్కౌట్ అయ్యేలా అనిపించాయి. ముఖ్యంగా మనం ఎక్కువగా వినే డేజావు ఎక్స్పరిమెంట్ కాస్త ఆసక్తికరమనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ సినిమా మీద మరింత ఆసక్తిని పెంచేలా ఉంటుంది. ఈ మధ్య రొటీన్ గా జరుగుతున్న తంతులాగానే ఈ సినిమా చివర్లో మరో భాగం చేసే అవకాశం ఉందనేలా హింట్ ఇచ్చారు. ప్రేక్షకుల బుర్రకు పదును పెట్టే విధంగా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చాయి. వాటి తరహాలోనే ఈ సినిమా కూడా సాగుతుంది. అయితే దాన్ని ప్రేక్షకులు ఎంతవరకు తీసుకుంటారు అనేదాన్ని బట్టి సినిమా రిజల్ట్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక నటీనటుల విషయానికొస్తే కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా మోహన్ భగత్ బాగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. మధ్యలో కొన్ని వెబ్ సిరీస్ చిన్న చిన్న సినిమాలు కూడా చేసిన అతను ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో కనిపించి ఒకసారిగా అందరినీ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఉన్నంతలో మోహన్ భగత్ ఆకట్టుకున్నాడు. ఇక సుప్రీతా సత్యనారాయణ కూడా తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంది. ఇక సురభి ప్రభావతి పాత్ర ఒక రేంజ్ లో పేలింది. సైంటిస్ట్ పాత్రలో అర్జున్ రెడ్డి ప్రొఫెసర్ భూషణ్ మరోసారి గుర్తుండిపోయే పాత్ర చేశాడు. ఇక లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్ వంటి వాళ్లు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీతో పాటు విజువల్స్ కూడా బాగున్నాయి. ఎక్కడో ఒక రిమోట్ గ్రామంలో సినిమా షూట్ చేసిన విధానం ప్రేక్షకులకు కాస్త కొత్త ఫీల్ ఇస్తుంది. ముఖ్యంగా గ్రీనరీని హైలెట్ చేస్తూ సినిమాటోగ్రఫీ పనితనం కనిపిస్తుంది. ఇక పాటలు అంత గుర్తుంచుకునేలా లేవు కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మాత్రం అదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితనం కూడా సినిమా మొత్తం మీద మాట్లాడుతుంది. సింపుల్ కథనే కొత్త స్క్రీన్ ప్లేతో నడిపించాలనే ప్రయత్నం చేశారు కానీ అది ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఓవరాల్ గా ఆరంభం ఒక సరికొత్త స్క్రీన్ ప్లే తో వచ్చిన మంచి ప్రయోగం.. అయితే కామన్ ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఫలితం ఉంటుంది.