కేంద్రం కీలక నిర్ణయం.. ఇక టూ-వీలర్లన్నింటిలో ABS తప్పనిసరి.. అసలు ఏంటీ ఏబీఎస్

రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహనల ద్వారా జరిగే ప్రమాదాలు కగనిపిస్తుంటాయి. వివిధ కారణాలతో బైక్స్ ప్రమాదాలకు గురవుతుంటాయి.


అయితే, ఈ టూవీలర్ ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. టూ-వీలర్ ప్రమాదాలను తగ్గించేందుకు ఉపయోగిస్తున్న యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS)ను దేశంలో అమ్ముడయ్యే అన్ని బైకుల్లో ఏర్పాటు చేయడాన్ని తప్పనిసరి చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జనవరి 1, 2025 నుంచే అమలులోకి తీసుకురావాలనుకుంటోంది.

ఈ మేరకు త్వరలోనే కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న 150 సీసీ ఆపైన ఎక్కువ సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న టూ- వీలర్లకే ఏబీఎస్ తప్పనిసరి నిబంధన అమలవుతోంది. అయితే, ఇకపై ఎంట్రీ లెవల్ బైకులు సహా అన్ని ద్విచక్ర వాహనాలకూ దీన్ని తప్పనిసరి చేయనున్నారు. దేశంలో ఉన్న బైకుల్లో ఎంట్రీ లేవెల్ టూ-వీలర్లే ఉన్నాయి. ఇక 2022 లో జరిగిన ప్రమాదాల్లో 20 శాతం ద్విచక్ర వాహనాల కారణంగా జరిగాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఏబీఎస్ తప్పనిసరి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఏబీఎస్ అంటే ఏంటీ? ఎలా పని చేస్తుంది?

ఏబీఎస్ అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది వాహనాల్లో ఉపయోగించే భద్రతా సిస్టమ్. ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు సడెన్ బ్రేకులు వేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు డ్రైవర్ బండిపై నియంత్రణ కోల్పోయి కింద పడిపోతుంటారు. అలా సడన్ బ్రేకులు వేసిన సమయంలో టైర్లు లాక్ కాకుండా ఈ ఏబీఎస్ సిస్టమ్ నిరోధిస్తుంది. దీని వల్ల డ్రైవర్‌కు వాహనం మీద నియంత్రణ ఉంటుంది. బండి స్కిడ్ కాకుండా నివారిస్తుంది.పెరగనున్న ధరలు..

టూవీలర్లలో ఏబీఎస్ తప్పనిసరి చేస్తే అందుకు తగినట్లుగా ద్విచక్ర వాహనాల ధరలు సైతం పెరుగుతాయి. ఏబీఎస్ అమర్చితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ భారాన్ని వినియోగదారులకే బదిలీ చేస్తాయి కంపెనీలు. దీంతో ఎంట్రీ లెవల్ బైకులు, స్కూటర్ల ధరలు రూ. 2500- రూ. 5000 వరకు పెరిగే ఛాన్స్ ఉంటుదని టూ-వీలర్ పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ధరలు పెరిగినా ప్రమాదాలను అడ్డుకునేందుకు ఏబీఎస్ ఉపయోగపడుతుందని చెబుతున్నాయి.

టూ-వీలర్ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా కనిపించేది బండి అదుపుతప్పి పడిపోవడం, ఇతర వాహనాల కిందకు లాక్కెళ్లడం వంటివి కనిపిస్తాయి. ప్రధానంగా అది బండిపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే జరుగుతుంది. దీనిని కంట్రోల్ చేసేందుకే ఏబీఎస్ పని చేస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.