ఆదాని.. ప్రధాని మోదీ బినామీ.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

www.mannamweb.com


Andhrapradesh: ఎన్నికల ఫలితాలపై జూన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రివ్యూ చేశారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ… పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై జూన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రివ్యూ చేశారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చ జరిగిందన్నారు. దేశ వ్యాప్త కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని.. అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్‌ల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారని తెలిపారు. సవివరంగా, ప్రజాస్వామ్య బద్దంగా అందరి అభిప్రాయాలను గౌరవించే సంప్రదాయం ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగిందన్నారు. కులగణన అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ (Congress) లేవనెత్తిందని తెలిపారు.

భారత రాజ్యాంగాన్ని బీజేపీ గౌరవించడం లేదని విమర్శించారు. బీజేపీ ఏకపక్ష నిర్ణయాలపై దేశ వ్యాప్త పోరాటాలకు సిద్ధం అవుతున్నామన్నారు. బీజేపీ మైనారిటీల మనోభావాలను దెబ్బ తీసిందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ మీద బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. వక్ఫ్ చట్ట సవరణతో మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా చర్యలు తీసుకుందని వ్యాఖ్యలు చేశారు. సెబీ ఆదాని అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చిందన్నారు. సెబీని తన గుప్పెట్లో పెట్టుకొని ఆదానిని కాపాడుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగవ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. కులగణనపై గ్రామస్థాయిలో పోరాటాలు చేయబోతోందని తెలిపారు. అవినీతిరహిత పాలన అంటూ బీజేపీ గొప్పలు చెబుతోందని.. కానీ ఆదాని – మోడీల అవినీతిని రాహుల్ గాంధీ ఎప్పుడో ఎండగట్టారన్నారు.

ఆదాని.. మోడీ బినామీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆదానిని కాపాడే విషయంలో మోడీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. క్షేత్రస్థాయిలోకి మోడీ అవినీతిని తీసుకెళ్లేలా కార్యాచరణ ఉండబోతోందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కాగా.. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నికల సన్నద్ధత, సంస్థాగత విషయాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వివిధ అంశాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్‌లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సమావేశం చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది.