6 ఏళ్లు దాటితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్.. 2026 నుంచి అమలు

ఢిల్లీలోని పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేరేందుకు కనీస వయస్సు నిబంధనను ప్రభుత్వం మార్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరేళ్లు నిండిన పిల్లలనే ఒకటో తరగతిలో చేర్చుకోనున్నారు.


జాతీయ విద్యా విధానం (NEP) 2020 మరియు పిల్లల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (DoE) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయగా.. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.

కచ్చితంగా మూడేళ్ల ప్రీ-ప్రైమరీ విద్య పూర్తి చేయాలి..!

పిల్లలకు ఆట పాటలతో కూడిన పునాది విద్యను పటిష్టంగా అందించాలనే ఉద్దేశ్యంతో ఈ మార్పులు చేసినట్లు DoE తెలిపింది. జూన్ 20న విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం.. పాఠశాలలు తమ పునాది స్థాయిని కొత్త వయస్సు నిబంధనలకు అనుగుణంగా మార్చుకోవాలి. దీని ప్రకారం పిల్లలు ఒకటో తరగతిలో చేరే ముందు తప్పనిసరిగా మూడు సంవత్సరాల ప్రీ-ప్రైమరీ విద్యను పూర్తి చేయాలి. అంటే నర్సరీ (బాల వాటిక/ప్రీస్కూల్ 1), లోయర్ కేజీ (బాల వాటిక/ప్రీస్కూల్ 2), అప్పర్ కేజీ (బాల వాటిక/ప్రీస్కూల్ 3) చదవాల్సి ఉంటుంది.

కొత్త వయస్సు నిబంధనలు ఇలా..

నర్సరీ (బాల వాటిక/ప్రీస్కూల్ 1): 3+ సంవత్సరాలు

లోయర్ కేజీ (బాల వాటిక/ప్రీస్కూల్ 2): 4+ సంవత్సరాలు

అప్పర్ కేజీ (బాల వాటిక/ప్రీస్కూల్ 3): 5+ సంవత్సరాలు

క్లాస్ 1: 6+ సంవత్సరాలు

ప్రీ-ప్రైమరీ తరగతుల పేర్లను పాఠశాలలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు అని DoE స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం DoE పరిధిలోని అన్ని రకాల పాఠశాలలకూ వర్తిస్తుంది. ఈ మార్పులకు అనుగుణంగా సిద్ధం కావాలని, త్వరలో మరిన్ని మార్గదర్శకాలు విడుదల చేస్తామని DoE పేర్కొంది.

ఈ విద్యా సంస్కరణ ప్రక్రియలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల నిర్వహణ కమిటీలు, విద్యా సంస్థలు, నిపుణులు, మరియు ప్రజల భాగస్వామ్యం అవసరమని DoE కోరుతోంది. “ఈ ప్రక్రియను మరింత కలుపుగోలుగా చేయడానికి, అభివృద్ధి చేస్తున్న విధానంపై అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోవడం చాలా అవసరం” అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. సరైన వయస్సులో పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అందరి సహకారంతో ఢిల్లీ విద్యావ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.