నిన్న మొన్నటి వరకు ఆ జట్టును అంతా పసికూనగా చూశారు. ఈ టీమ్ ఏం చేయగలదని తక్కువ అంచనా వేశారు. అయితే అదే ఇప్పుడు మోస్ట్ డేంజరస్ సైడ్‌గా మారింది. గ్రూప్ దశ దాటితే గొప్ప అనుకుంటే..
ఏకంగా సెమీస్‌కు అర్హత సాధించింది. మనం మాట్లాడుకుంటోంది ఆఫ్ఘానిస్థాన్ గురించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రషీద్ సేన అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పట్టుదలతో ఆడుతూ పొట్టి కప్పు సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్-8లో తొలుత ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆ తర్వాత కీలకమైన మరో పోరులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి సగర్వంగా నాకౌట్ గడప తొక్కింది. దీంతో ఆ దేశమంతటా సంబురాలు మిన్నంటాయి. ఆఫ్ఘాన్ గెలుపును ఆ దేశ ప్రజలు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఆకలి, పేదరికం, అణచివేత, నిరసనల మధ్య సంతోషానికి ఆమడ దూరంలో ఉండే ఆఫ్ఘానిస్థాన్‌లో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొంది. రషీద్ సేన సక్సెస్‌ను ఆ దేశ ప్రజలు ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరికీ భయపడకుండా రోడ్ల మీదకు వచ్చి సంబురాలు చేసుకుంటున్నారు. వేలాది మంది ఒకేచోట గుమిగూడి తమ ఆనందాన్ని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. ఇన్నేళ్లుగా తాము పడుతున్న బాధ, వేదనను మర్చిపోయి క్రికెట్ టీమ్ గెలుపును ఆస్వాదిస్తున్నారు. ఈ తరుణంలో అక్కడి తాలిబన్ సర్కారు నుంచి భారత క్రికెట్ బోర్డుకు ఓ స్పెషల్ మెసేజ్ అందింది. క్రికెట్లో ఆఫ్ఘాన్ జట్టు ఎదుగుదల కోసం చేసిన కృషికి, అందిస్తున్న సాయానికి గానూ బీసీసీఐకి థ్యాంక్స్ చెప్పింది అక్కడి ప్రభుత్వం.
‘మేం ఎప్పటికీ భారత్‌కు రుణపడి ఉంటాం. ఆఫ్ఘానిస్థాన్ టీమ్ ఎదుగుదల కోసం వాళ్లు అందించిన సహాయ సహకారాలు అపూర్వం. భారత బోర్డు చేసిన పనిని మెచ్చుకోకుండా ఉండలేం’ అని తాలిబన్ గవర్నమెంట్ పొలిటికల్ హెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీసీసీఐకి తాలిబన్ల నుంచి వచ్చిన మెసేజ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆఫ్ఘాన్ల సక్సెస్‌లో ఇండియా పాత్ర ఎంతో ఉందని అంటున్నారు. అడిగిన వెంటనే వాళ్లకు అవసరమైన వేదికలు ఇవ్వడం, సిరీస్‌ల నిర్వహణ.. ఇలా ఎన్నో విధాలుగా రషీద్ సేనకు బీసీసీఐ అంతా తానై అండగా నిలబడిందని మెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘాన్‌కు మన బోర్డు నుంచి ఇక మీదట కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందాలని కోరుకుంటున్నారు.
TALIBAN THANK THE BCCI…!!! 🇮🇳🇦🇫
The Taliban's political head said, "We're always thankful to India and their continuous help to build the Afghan team, we really appreciate it". (WION). pic.twitter.com/0CUHFtmBCx
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2024