వచ్చే ఐదేళ్లలో అగ్రి-టెక్ రంగంలో 80 వేల కొత్త ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాలదే సింహభాగం

www.mannamweb.com


వ్యవసాయరంగంలో అధిక రాబడి తీసుకురావడానికి, రైతులకు సీజనల్ సలహా సూచనలు చేయడం నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు అగ్రి టెక్ రంగం వినూత్న పోకడలకు తెర తీస్తుంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలతోపాటు వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగావకాశాలు సృష్టించేందుకు రంగం సిద్ధం చేస్తుంది..

భారత్‌లో అగ్రి-టెక్ రంగం వచ్చే ఐదేళ్లలో 60 నుంచి 80 వేల వరకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. వ్యవసాయ రంగంలో ప్రతీ అవసరాన్ని అగ్రి-టెక్ సెక్టార్‌ తీర్చగలదని ఆయన ధీమా వ్యాక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, నీటి పారుదల పురోగతి నుంచి అధునాతన వ్యవసాయ యంత్రాలకు యాక్సెస్, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి మార్కెట్ అనుసంధానాలను అందించడం వరకు వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అగ్రిటెక్ పరిష్కరిస్తుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ సుబ్బురథినమ్‌ వెల్లడించారు.

క్రెడిట్, ఇన్సూరెన్స్, డిజిటల్ చెల్లింపు పరిష్కారాలను అందించడం ద్వారా ఆర్థిక అంతరాలను పూడ్చడం, వాతావరణ సూచనలు, తెగుళ్లు, వ్యాధుల అంచనాలు, నీటిపారుదల హెచ్చరికలు వంటి వాటిపై రియల్‌ టైమ్‌ సలహా సేవలను ఈ రంగం రైతులకు అందిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో అగ్రిటెక్ రంగంలోని సాంకేతిక, కార్యాచరణ, నిర్వాహక రోల్స్‌తోపాటు పలు విభాగాల్లో సుమారు 1 లక్ష మంది ఎంప్లయిస్‌ ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 60 నుంచి 80 వేల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించగలదని అన్నారు. అయితే ఈ ఉద్యోగాలన్నీ ఏఐ డెవలప్‌మెంట్‌, టెక్నాలజీ, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌, సస్లైనబుల్‌ ఫార్మింగ్‌ సొల్యూషన్‌ వంటి అధునాతన సాంకేతికత నైపుణ్యాలతో ముడిపడి ఉన్నాయని సుబ్బురథినం చెప్పారు. అలాగే పలు అగ్రిటెక్ ఉద్యోగాలు కాలానుగుణంగా ఉండవని స్పష్టం చేశారు. అందుకు కారణం.. ఈ రంగం సాంకేతిక ఆవిష్కరణలు, విశ్లేషణలు, నిరంతర కార్యాచరణ మద్దతుపై దృష్టి పెడుతున్నాయని వివరించారు. ఆయా సీజన్లలో పంట పర్యవేక్షణ, విత్తనాలు, కోత సమయాల్లో కాలానుగుణంగా డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ, ఆఫ్-సీజన్‌లో నైపుణ్యం పెంచడం వంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించవల్సి ఉంటుందని ఆయన చెప్పారు. అందుకే అగ్రిటెక్ ఉద్యోగాలనేవి హైబ్రిడ్, ఆన్-గ్రౌండ్ రెండింటి కలయిక అని ఆయన అంటున్నారు.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా అనలిటిక్స్, మేనేజ్‌మెంట్ కార్యకలాపాలు రిమోట్‌గా చేయవల్సి ఉంటుంది. మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు, వ్యవసాయ శాస్త్రవేత్తలు.. రైతులకు సలహాసహాయాలు అందించడానికి, ఫీల్డ్ కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షించడానికి ఉద్యోగులు ఫీల్డ్‌లో ఉండాలని సుబ్బురథినం పేర్కొన్నారు. మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో ఈ ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక బెంగళూరు, హైదరాబాద్, పూణే, గురుగ్రామ్ వంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కేంద్రంగా పనిచేస్తాయని.. డెవలప్‌మెంట్‌, మేనేజ్‌మెంట్ రోల్స్‌లో అధిక ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ మరియు IoT వంటి అధునాతన సాంకేతికతలు రైతులకు దోహదం చేస్తున్నప్పటికీ.. రైతులకు ఆచరణాత్మక, వినియోగదారు-స్నేహపూర్వక సాధనాలను అందించడంపై అగ్రిటెక్‌ సెక్టార్ దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెరుగైన వనరులు, అవకాశాలకు అనుసంధానం చేయడం ద్వారా అగ్రిటెక్.. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని, ముఖ్యంగా చిన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు రాబట్టడానికి, స్థిరమైన వృద్ధికి ఇది భరోసా ఇస్తోందని ఆయన అన్నారు. కాగా NASSCOM డేటా ప్రకారం 2022లో భారత్‌లో దాదాపు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నాయి.