Agricultural Equipment : రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లు.. డ్రోన్లు

మొత్తంగా 20 రకాల పరికరాలుపంపిణీకి ప్రభుత్వం నిర్ణయం


రూ.50 నుంచి 60 కోట్ల ఖర్చు

ఒప్పందాలకు టెండర్ల ఆహ్వానం

దాఖలుకు 7 వరకు అవకాశం

హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో యాంత్రీకరణపై సర్కారు దృష్టి పెట్టింది.

రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు, కల్టివేటర్లు, మందులు పిచికారీ చేసేందుకు డ్రోన్లు, పవర్‌ స్పేయర్లు సహా సాగులో ఉపయోగపడే 20 పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పరికరాల తయారీ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు వ్యవసాయ శాఖ టెండర్లు ఆహ్వానించింది. కంపెనీలకు ఫిబ్రవరి 7వ తేదీ వరకు టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించింది. బిడ్‌లను ఫిబ్రవరి 8న తెరవనున్నారు. సబ్సిడీ కింద ఇచ్చే పరికరాల కోసం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల దాకా ఖర్చవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. గత ప్రభుత్వ హయాంలోనే యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఆశించిన స్థాయిలో అమలు చేయలేదు. కాగా రైతులకు సబ్సిడీ కింద ఇవ్వనున్న పరికరాలలో 600 ట్రాక్టర్లు, 160 వరకు డ్రోన్లు ఉన్నాయి. దుక్కి కోసం ట్రాక్టర్లకు కల్టివేటర్‌, ప్లవ్‌, రోటవేటర్లు సహా అమర్చే వివిధ పరికరాలనూ అధిక మొత్తంలో ఇవ్వనుంది. కాగా టెండర్లలో పేర్కొన్న వివరాల ప్రకారం రోటవేటర్లు 12వేల యూనిట్లు, కల్టివేటర్లు 4వేల యూనిట్లు, ప్లవ్‌ రూ.2వేల యూనిట్లు, గడ్డికట్టే యంత్రాలు 200 యూనిట్లు, భూమిపై గడ్డిని తొలగించే బ్రష్‌ కట్టర్లు 400, పొలం గట్లు వేసే బండ్‌ ఫోర్మర్లు 64, మొక్కల మధ్య ఉన్న గడ్డిని తొలగించేందుకు పవర్‌ వీడర్స్‌ 200 ఇవ్వనున్నారు. మొక్కజొన్నను గింజలుగా వేరుచేసే యంత్రాలు 80, పవర్‌ ట్రిల్లర్‌లు 420 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక 16-20 లీటర్ల ట్యాంకు సామర్ధ్యంతో ఉన్న పవర్‌ స్ర్పేయర్‌లు 12వేలు, 12-16 లీటర్ల ట్యాంకు సామర్థ్యంతో ఉన్న పవర్‌ స్ర్పేయర్‌లు 6,300, డీజిల్‌, కరెంటుతో నడిచే పంప్‌సెట్లు 1,230 యూనిట్లతో పాటు నీటిని సరఫరా చేసే పీవీసీ, హెచ్‌డీపీఈ పైపులు 1,40,000, స్టోరేజీ బిన్స్‌ 50వరకు ఇవ్వాలని నిర్ణయించారు.