తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. భారీగా కురిసిన వానలతో విపరీతమైన వరదలు సంభవించాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. చెరువులు, కాలువలకు గండ్లు పడి వరద రోడ్లపైకి చేరడంతో ధ్వంసం అయ్యాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదల ధాటికి రైల్వే ట్రాక్ లు సైతం కొట్టుకుపోయాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వరదల కారణంగా ఎంతో మంది ఆహారం, నీరు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ప్రముఖ టెలికాం సంస్థ గొప్ప మనసు చాటుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొబైల్ నెట్ వర్క్ కీలకం. క్షేమ సమాచారం, ప్రమాద తీవ్రత తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ కీలకంగా మారింది. అయితే రీచార్జ్ వ్యాలిడిటీ ముగిసి కస్టమర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎయిర్ టెల్ కస్టమర్లకు ఆఫర్ ఇచ్చింది. కాల్స్, డేటా విషయంలో అదనపు వ్యాలిడిటీని అందించింది. విపత్తు సమయంలో యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రీపెయిడ్ వినియోగదారులకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ప్రకటించింది. కాల్స్‌తోపాటు 4 రోజులపాటు రోజుకు 1.5జీబీ మొబైల్ డేటాను అందించనుంది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల బిల్లు చెల్లింపునకు వారంపాటు గడువు పొడిగించింది.
ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వాళ్లకు 4 రోజుల అదనపు వ్యాలిడిటీని కల్పించినట్టు ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ఎయిర్ టెల్ కస్టమర్లకు ఈ బెనిఫిట్స్ దక్కనున్నాయి. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇటీవల వయనాడ్ లో కూడా భారీ వర్షాలు, వరదలు రావడంతో అక్కడ కూడా ఎయిర్ టెల్ తన కస్టమర్లకు అదనపు బెనిఫిట్స్ అందించిన విషయం తెలిసిందే.