కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith Kumar) సినిమా సంక్రాంతికి వస్తుందని ఆయన అభిమానులు ఆశించారు. అయితే… ‘విడా మయూర్చి’ వాయిదా పడింది.
మరో సినిమా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు అజిత్ వార్తల్లో ఉండేలా చేసింది ఆ రెండు సినిమాలో కాదు… రేసింగ్! ఆయనకు బైక్, కార్ రేసింగ్ అంటే ఎంత ఇష్టమనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దుబాయ్ వేదికగా జరగనున్న ‘Dubai 24 Hours Race’లో పాల్గొనడం కోసం ఆయన వెళ్లారు.
అజిత్ కారుకు ఘోర ప్రమాదం!
దుబాయ్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో బార్య శాలిని, కుమారుడు అద్విక్… ఇద్దరికీ అజిత్ సెండ్ ఆఫ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దుబాయ్ వెళ్లిన ఆయన రేసింగ్ కోసం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అందులో అజిత్ కారు ఘోర ప్రమాదానికి గురైంది.
అజిత్ కుమార్ కారు ప్రమాదానికి గురైన విషయాన్ని ఆయన రేసింగ్ టీం సోషల్ మీడియాలో తెలియజేసింది. ”ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అజిత్ కుమార్ కారు మాసివ్ క్రాష్ అయింది. అయితే ఆయనకు ఒక్క గీత కూడా పడలేదు. ఎటువంటి గాయాలు లేకుండా బయటకు నడుచుకుంటూ వచ్చారు. రేసింగ్ అంటే అంతే” అని అజిత్ కుమార్ రేసింగ్ సోషల్ మీడియా అకౌంట్ పేర్కొంది.
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు!
అజిత్ కుమార్ లాంటి స్టార్ హీరో కారు ప్రమాదానికి గురైతే, అందులోనూ కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో కారు రేసింగ్ సర్క్యూట్ లో ప్రమాదానికి గురైతే… ఆయనకు ఏమైందో అని అభిమానులు ఆందోళన చెందుతారు. అందుకని ముందుగా అందరికీ సమాచారం ఇచ్చారు. ”రేసింగ్ ప్రాక్టీస్ సెషన్ వీడియో బయటకు వచ్చింది. అజిత్ గారు సురక్షితంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని అజిత్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
సొంతంగా టీం ఏర్పాటు చేసిన అజిత్ కుమార్!
‘దుబాయ్ 24 అవర్స్ రేసింగ్’లో పార్టిసిపేట్ చేయడం కోసం కోలీవుడ్ స్టార్ అజిత్ సొంతంగా ఒక టీం ఏర్పాటు చేశారు. దానికి ఓనర్ ఆయనే. ఒకవైపు యజమానిగా, మరొక వైపు రేసర్ కింద ఈ రేసులో ఆయన పాల్గొంటారు. ఒక ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్లో అజిత్ పార్టిసిపేట్ చేస్తుండటం ఇదే మొదటి సారి. ఒకవేళ ఇందులో గనక ఆయన విజయం సాధిస్తే… గ్రాండ్ డెబ్యూ ఇచ్చినట్లు అవుతుంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అజిత్ ఫ్యామిలీ సింగపూర్ వెళ్ళింది. అక్కడే తన కుమార్తె అనౌష్క పుట్టినరోజును కూడా సెలబ్రేట్ చేశారు. జనవరి 5న ఇండియా వచ్చిన అజిత్… ఒక రోజు తర్వాత మళ్లీ రేసింగ్ కోసం దుబాయ్ ప్రయాణం అయ్యారు. ఆ తర్వాత కుటుంబాన్ని ఇండియాలో వదిలి వెళ్లారు.