పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వేట్టువం’ సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తూ స్టంట్‌మ్యాన్ రాజు మృతిచెందిన విషయం తెలిసిందే.
ఇండస్ట్రీలో చర్చనీయాశంగా మారిన రాజు మరణవార్త విని బాలీవుడు అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) చలించిపోయారు. దీంతో ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇండస్ట్రీలోని 650 మంది స్టంట్ మ్యాన్‌లకు ఇన్సూరెన్స్ చేయించారు. మంచి మనసుతో ఆయన చేసిన ఈ పనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఈ ఇన్సూరెన్స్ పాలసీలో ఆరోగ్య, ప్రమాద బీమా రెండూ ఉన్నాయి. స్టంట్ మ్యాన్ సెట్‌లో, బయట ఎక్కడైనా గాయపడితే రూ.5 లక్షల వరకు బీమా పొందవచ్చు. అక్షయ్ చేసిన ఈ పనిపై బాలీవుడ్ ప్రముఖ స్టంట్ మాస్టర్ విక్రమ్‌సింగ్ స్పందించారు. ‘మీకు ఎలా ధన్యవాదాలు తెలపాలో అర్థం కావట్లేదు. మీరు చేసిన ఈ పని వల్ల బాలీవుడ్‌లో దాదాపు 650 నుంచి 700 మంది స్టంట్‌మ్యాన్‌లు, యాక్షన్ సిబ్బంది ఇప్పుడు బీమా పరిధిలోకి వచ్చారు’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
కథానాయకుడు ఆర్య (Arya), దర్శకుడు పా.రంజిత్ (pa ranjith) కాంబినేషన్‌లో రానున్న ‘వేట్టువం’ షూటింగ్‌లో స్టంట్‌మ్యాన్ రాజు మృతి చెందారు. నాగపట్నం సమీపంలో కారుతో స్టంట్స్ చేస్తుండగా రాజు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం చిత్రబృందం సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆయన మరణం ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో దర్శక, నిర్మాతలు మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

































