GVMC Standing Committee Elections: గ్రేటర్ విశాఖపై కూటమి జెండా పాతింది. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది మంది సభ్యులనూ కూటమి పార్టీలే గెలుచుకున్నాయి.
నిజానికి, నిన్న మొన్నటి వరకు గ్రేటర్ విశాఖలో వైసీపీకే బలం ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో.. కార్పొరేటర్లు కూడా కూటమి బాట పట్టారు. ఆల్రడీ అధికారికంగానే 17 మంది వైసీపీ కార్పొరేట్లు టీడీపీ, జనసేనలో చేరారు. అయినా సరే.. వైసీపీకి బలం ఉన్నట్టే లెక్క. కాని, స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి హవా సాగిందంటే.. క్రాస్ ఓటింగ్ జరిగిందనే అర్థం. పేరుకే వైసీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు గానీ ఓట్లు మాత్రం కూటమి సభ్యులకే వేశారని ఈ ఎన్నికతో తేలిపోయింది. ఈ ఎన్నికతో గ్రేటర్ విశాఖపై వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోయిందనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
కూటమి పార్టీలు, వైసీపీ మధ్య గ్రేటర్ విశాఖ స్థాయీ సంఘం ఎన్నిక హోరాహోరీగా సాగింది. గ్రేటర్ విశాఖపై పూర్తి పట్టు సాధించేలా ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది కూటమి. ఈ ఎన్నికను అటు కూటమిలోని టీడీపీ-జనసేన-బీజేపీ.. ఇటు వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో క్యాంపు రాజకీయాలు జోరుగా నడిచాయి. కార్పొరేటర్లు తమ కనుసన్నల నుంచి తప్పించుకోకుండా ఇరువర్గాల వాళ్లు కాపు కాశారు. 97 మంది కార్పొరేటర్లలో 96 మంది ఓటింగ్‌లో పాల్గొనేలా చేశారు. కాని, ఓట్లు మాత్రం అల్టిమేట్‌గా కూటమి సభ్యులకే పడ్డాయి.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 2 గంటలకు ముగిసింది. మధ్యాహ్నం రెండున్నరకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం పది స్థానాలకు గాను ఎన్నిక జరిగింది. ప్రతి కార్పొరేటర్ పది ఓట్లు వేయడంతో మొత్తం 960 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక్కో బ్యాలెట్ పేపర్‌పై 20 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. వాటి పక్కనే ఒక్కో సభ్యుడు 10 మంది అభ్యర్థులకు టిక్కులు పెట్టాల్సి ఉంటుంది. పోటీ చేసిన ఒక్కో సభ్యునికి కనీసం రావలసిన ఓట్లు 49. కాని, ఏడుగురు సభ్యులకు 60 కి పైగా ఓట్లు వచ్చాయి. దీంతో.. వైసీపీ కార్పొరేటర్లు కూటమికే పట్టం కట్టారని అర్థమైపోతోంది.
అయితే.. కౌంటింగ్‌పై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, టీడీపీ ఏజెంట్లు బ్యాలెట్ పేపర్‌పై పెన్సిల్‌తో గుర్తు పెట్టి ఇచ్చారని వైసీపీ నాయకులు ఆరోపించారు. దీంతో కాసేపు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ నాయకులు వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.