విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి

www.mannamweb.com


విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది.

విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత రైళ్లు వస్తుంటాయి.. అయితే ఆ సమయంలో ప్రయాణికులు బయటకు వచ్చి ఏమైనా తినాలంటే కుదరడం లేదు. ఆ సమయంలో హోటళ్లన్నీ మూసేసి ఉంటున్నాయని కొంతమంది ప్రస్తావించారు. అంతేకాదు నగరానికి నిత్యం పర్యాటకులు వస్తుంటారు.. వారికి కూడా రాత్రి సమయంలో 10 తర్వాత వెళితే ఫుడ్ అందుబాటులో ఉండటం లేదు.

విశాఖపట్నం పర్యాటకంగా ఎదుగుతున్న సమయంలో.. ఇలా ఫుడ్ అందుబాటులో లేకపోవడంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో రాత్రి 12 గంటల వరకు ఆహారం లభించేలా హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచుకునేందుకు పోలీసులు అనుమతించాలని రిక్వెస్ట్‌లు వచ్చాయి. అయితే అర్ధరాత్రి వరకూ హోటల్స్, రెస్టారెంట్లు, వ్యాపార కేంద్రాలు తెరిచి ఉంచితే రౌడీమూకలు, ఆకతాయిలతో సమస్యలు వస్తాయని పోలీసులు ఆలోచించారు. నగరంలో రాత్రి సమయాల్లో గస్తీ పెంచి, పర్యాటకులకు అవసరమైనవి అందుబాటులో ఉంచడం వల్ల అభివృద్ధి సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్‌ను సీపీ డా.శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. విమానాశ్రయంలో ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్ ఏర్పాటుపై అందిన వినతుల మేరకు, ప్రయాణికుల సంరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని ఈ ప్రీ పెయిడ్ టాక్సీ కౌంటర్‌లో పనిచేసే టాక్సీ యజమానులు, డ్రైవర్లు పూర్తి వివరాలతో పాటుగా టాక్సీ జీపీఎస్ ద్వారా పోలీసు వారి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలన్నారు.