అల్లు అర్జున్ అప్రమత్తం: ఇంట్లో హుటాహుటి భేటీ: రాత్రంతా

www.mannamweb.com


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ ముసురుకున్న వివాదాలు రోజురోజుకూ తీవ్ర రూపాన్ని దాల్చుతూ వస్తోన్నాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన..

అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన తరువాత ఈ వ్యవహారం మొత్తం రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్‌ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చంద్రాయణగుట్ట శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సహా పలువురు సభ్యులు ఈ తొక్కిసలాట ఉదంతంపై ఘాటుగా స్పందించారు. అదేరోజు సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వివాదానికి అడ్డుకట్ట వేయకపోగా మరింత ఆజ్యం పోసినట్టయింది.

అనుమతి లేకుండా, బాధ్యతారహితంగా పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి తాను సంధ్యా థియేటర్‌కు వెళ్లాననడం సరికాదని, అది తప్పుడు సమాచారమంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. దీన్నొక యాక్సిడెంట్‌గా తీసుకోవాలంటూ అభ్యర్థించారు. ఇందులో ఎవరి తప్పూలేదని చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద రోడ్‌షో చేయలేదని, పోలీసుల డైరెక్షన్‌లోనే థియేటర్‌కు వెళ్లాననీ అన్నారు.

ఈ ప్రెస్ మీట్ తరువాత ఆయనపై దాడి మరింత తీవ్రతరమైంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు బల్మూరి వెంకట్, విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్‌లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శించారు. పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.

ఊహించని విధంగా నోటీసులు రావడంతో అల్లు అర్జున్ అప్రమత్తం అయ్యారు. హుటాహుటిన తన లీగల్ టీమ్‌తో భేటీ అయ్యారు. వారిని ఇంటికి పిలిపించుకున్నారు. రాత్రి 8: 30 గంటల సమయంలో లీగల్ టీమ్ సభ్యులు ఆయన ఇంటికి వెళ్లారు. నేటి విచారణను ఎలా ఎదుర్కొనాల్సి ఉంటుందనే విషయంపై కసరత్తు సాగించారు.

నోటీసుల్లో పోలీసులు పొందుపరిచిన ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చించినట్లు చెబుతున్నారు. పోలీసుల నుంచి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి?, వాటికి ఎలా సమాధానాలు ఇవ్వాలి?, ఎలాంటి వివరాలను వాళ్లు సేకరించే ప్రయత్నం చేస్తారు?, ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది? అనే అంశాలపై చర్చించారని సమాచారం.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రస్తుతం అల్లు అర్జున్ నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ప్రెస్ మీట్‌లో చేసిన వ్యాఖ్యల వల్ల బెయిల్ రద్దయ్యే ప్రమాదం ఉందా? విషయంపైనా లీగల్ టీమ్ సభ్యులతో చర్చించారని చెబుతున్నారు. పోలీసులకు సంతృప్తికరమైన వివరణలను ఎలా ఇవ్వాలనే విషయంపై వాళ్లంతా అల్లు అర్జున్‌కు సూచనలు చేశారని అంటున్నారు.