పుష్ప2 చిత్రం బెనిఫిట్ షోకు హైదరాబాద్ సంధ్య థియేటర్ కు వెళ్లి తొక్కిసలాటకు కారణమయ్యారన్న ఆరోపణల తర్వాత టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ తొలిసారి ఆ ఘటన బాధితుడు అయిన మైనర్ బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు.
ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారు. ఈ మేరకు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అంతకు ముందు సికింద్రాబాద్ రాంగోపాల్ పేట సీఐ పేరుతో అల్లు అర్జున్ కు ఓ నోటీసు పంపారు. ఇందులో రాంగోపాల్ పేటతో పాటు నార్త్ జోన్ పోలీసులు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ఏర్పాట్లు చేశామని, అయితే చివరి నిమిషంలో వారు ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో మరోసారి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలనుకుంటే ఏర్పాట్లు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు రాంగోపాల్ పేట సీఐ అల్లు అర్జున్ కు సమాచారం పంపారు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ శ్రీతేజ్ ను పరామర్శించేందుకు వెళ్తున్నారు. కాసేపట్లో ఆయన ఇంటి నుంచి బయలుదేరి కిమ్స్ ఆస్పత్రికి వెళ్తారు. పోలీసులు ఆ మేరకు అల్లు అర్జున్ ఇంటి నుంచి కిమ్స్ ఆస్పత్రి వరకూ ఎస్కార్ట్ సహా ఇతర ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే కిమ్స్ ఆస్పత్రి వద్ద కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు.
అయితే అల్లు అర్జున్ పర్యటన రహస్యంగా ఉంచితే ఆస్పత్రి వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని నిన్న ఇచ్చిన సమాచారంలో పోలీసులు తెలిపారు.. అల్లు అర్జున్ టూర్ కు రాంగోపాల్ పేట పోలీసులు తగిన భద్రత ఏర్పాటు చేస్తారని కూడా తెలిపారు. తద్వారా శాంతియుతంగా మీరు వచ్చి వెళ్లొచ్చని సూచించారు.