రిజిస్ట్రేషన్‌తోపాటే దస్తావేజులూ సిద్ధం

రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే 4 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన గంటన్నరలోపే దస్తావేజులు అందజేస్తున్నారు. అలాగే.. మిగతా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ రిజిస్ట్రేషన్‌లు జరిగి, సబ్‌-రిజిస్ట్రార్‌ డిజిటల్‌ సంతకం పూర్తయిన వెంటనే  దస్తావేజు సిద్ధమైనట్లు కొనుగోలుదారుల వాట్సప్‌నకు లింక్‌ పంపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చే వారు కార్యాలయాల్లో గంటలకొద్దీ వేచి ఉండాల్సిన పని తప్పుతోంది. విజయవాడ పటమట, విశాఖలోని ఆర్‌ఓ, గుంటూరు నగరం కొరిటెపాడు, తిరుపతి రూరల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులతో త్వరగా డాక్యుమెంట్‌ చేతికందుతోంది. ఇందుకు ఈ కార్యాలయాల్లో అదనంగా నలుగురు ఉద్యోగులను నియమించారు. ఇతర కార్యాలయాల్లోనూ ఈ విధానం తీసుకురానున్నారు.


రిజిస్ట్రేషన్‌ జరిగిన రోజే దస్తావేజులు తీసుకోవడం చాలా చోట్ల సాధ్యపడటం లేదు. ఈ పరిస్థితుల్లో డాక్యుమెంట్‌ సిద్ధమైనట్లు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి కొనుగోలుదారులకు వాట్సప్‌ లింక్‌ వెళ్లడం ఊరటనిస్తోంది. ఈ లింక్‌ నుంచి దస్తావేజు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇప్పటికే పలు మార్పులు తెచ్చింది. స్లాట్‌ బుకింగ్‌ విధానంతో క్రయ, విక్రయదారుల సమయం ఆదా చేసింది. ఆ కార్యాలయాల్లో సంప్రదాయంగా వస్తున్న రాచరిక వ్యవస్థ (ఎరుపు బల్లలు)ను తొలగించింది. ఆగస్టు 1 నుంచి 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ జరిగిన వెంటనే ‘ఆస్తి పన్ను చెల్లింపు యజమాని పేరు’ (ఆటో మ్యుటేషన్‌)కూడా మార్చనుంది.

గ్రామ సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య (సక్సెషన్‌) రిజిస్ట్రేషన్‌లు చేయడంపై సందిగ్ధత నెలకొంది. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్‌ అసిస్టెంట్స్‌ అర్హతలు, సామర్థ్యం, సదుపాయాలు, సాంకేతిక సమస్యలపై ఉన్నత స్థాయిలో తర్జనభర్జన నెలకొంది. దీంతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తే సరిపోతుందని అధికారులు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.