Amaravati: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు భూముల సమస్య కొలిక్కి

www.mannamweb.com


Amaravati: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు భూముల సమస్య కొలిక్కి

అమరావతి: అమరావతిలో రోడ్డు కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. చెన్నై – కోల్‌కతా జాతీయ రహదారి నుంచి నేరుగా రాజధానిలోకి వెళ్లేందుకు ఉద్దేశించిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు విస్తరణకు అడ్డంకులు తొలగాయి. సమీకరణ విధానంలో ప్రభుత్వం భూములు తీసుకోనుంది. దీనికి రైతులు అంగీకరించారు. గతంలో తెదేపా హయాంలో విశాలమైన రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చురుగ్గా సాగిన పనులు 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయాయి. కరకట్ట దిగువన మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వరకు వచ్చి ఆగిపోయింది. భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకరించకుండా కోర్టుకు వెళ్లారు.

గత నెలలో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. కీలకమైన ఈ రోడ్డుపై దృష్టి సారించారు. మిగిలిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు పనులు ప్రారంభించేందుకు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల సీఆర్డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌.. పెనుమాక, ఉండవల్లిలోని రైతులతో చర్చలు జరిపారు. ఇవి కొలిక్కి రావడంతో మంతెన ఆశ్రమం నుంచి జాతీయ రహదారిపై ఉన్న మణిపాల్‌ ఆసుపత్రి వరకు రెండు దశల్లో నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఇందుకు దాదాపు 40 ఎకరాల మేర భూముల కోసం గతంలో ప్రకటన ఇచ్చారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. రాయపూడిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు అడ్డుగా ఉన్న చర్చి సమస్య కూడా పరిష్కారమైంది. దీనిని తొలగించేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. చర్చి యాజమాన్యానికి సమీపంలోనే స్థలం కేటాయించారు. దీనికి సీఆర్డీఏ నిరభ్యంతర పత్రం కూడా జారీ చేసింది. సమస్యలు పరిష్కారం కావడంతో పెనుమాక, ఉండవల్లి, రాయపూడిలో భూములు తీసుకునేందుకు సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్లు రంగంలోకి దిగారు. దీంతో సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. వారంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.